24లోగా ఎస్‌ఐఆర్ పూర్తి చేయాలి..
- జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా శుద్ధీకరణలో భాగంగా చేపడుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, ఈ నెల 24వ తేదీలోగా నాగర్‌కర్నూల్ పట్టణంలోని 31 పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రతి అర్హుడైన ఓటరు వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా డిజిటల్ విధానంలో నమోదు చేయాలని సూచించారు.
మంగళవారం ఉదయం నాగర్‌కర్నూల్ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉన్న 112, 113 పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, అక్కడ కొనసాగుతున్న ఓటర్ల నమోదు డిజిటలైజేషన్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు.
ముందుగా 112వ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, అక్కడ మొత్తం 1,199 మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు కేవలం 32 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయిందని అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం 113వ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ మొత్తం 1,540 మంది ఓటర్లు ఉండగా 33 శాతం మేర మాత్రమే నమోదు పూర్తయిందని తెలుసుకుని, డిజిటలైజేషన్ వేగాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రతిరోజూ కనీసం 60 మంది ఓటర్ల వివరాలను నమోదు చేసి, మిగిలిన ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైన ఆధార పత్రం అని అన్నారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో సక్రమంగా నమోదు కావడంతో పాటు, వారి వివరాలు ఖచ్చితంగా డిజిటలైజేషన్ కావడం ఎన్నికల పారదర్శకతకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి బూత్ లెవల్ అధికారి (బీఎల్‌వో) తన పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరిని స్వయంగా కలుసుకుని వివరాలను నమోదు చేయాలని సూచించారు.
నాగర్‌కర్నూల్ పట్టణ పరిధిలో మొత్తం 31 పోలింగ్ కేంద్రాల్లో 35,536 మంది నమోదిత ఓటర్లు ఉండగా, మంగళవారం ఉదయం 8 గంటల నాటికి 14,867 మంది ఓటర్ల వివరాలు మాత్రమే డిజిటలైజేషన్ ప్రక్రియలో నమోదు అయినట్లు ఆన్‌లైన్ సమాచారం వెల్లడించిందని కలెక్టర్ తెలిపారు.
మిగిలిన ఓటర్ల వివరాలను ఆలస్యం చేయకుండా నమోదు చేసి, ఈ నెల 24వ తేదీలోగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో భాగస్వామి అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, ఆర్డీవో అర్చన, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, డీటీ కిరణ్‌కుమార్, సంబంధిత శాఖల అధికారులు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
