పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ రెండూ బాధ్యత వహించాల్సిందే
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ రెండూ బాధ్యత వహించాల్సిందే
- యుద్ధ విరమణ మాటల మధ్య మళ్లీ దాడులు
- హార్మూజ్ జలసంధిపై పెరుగుతున్న ఆధిపత్య పోరు
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులతో మరింత ఉద్రిక్తత
- ప్రపంచ వాణిజ్యంపై యుద్ధ ప్రభావం పెరుగుతోంది
- శాంతి చర్చల కంటే ప్రతీకార చర్యలకే ప్రాధాన్యం
ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి కొద్ది రోజులైనా కాలేదు, మళ్లీ అమెరికన్ సేనలు ఇరాన్‌లోని 140 లక్ష్యాలపై దాడులు జరిపాయి. ఈ దాడుల్లో భారతీయ నావికుడు ఒకరు మరణించారు. కాగా, హార్మూజ్ జలసంధి ఇకపై పూర్తిగా తమ అధీనంలోనే ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. హార్మూజ్ సమీపంలోని కెష్క్ దీవిపై దాడి జరిగింది. అందుకు ప్రతీకారంగా ఇరాన్ అరబ్ దేశాలపై దాడులు జరిపింది. కాగా, ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా ఖమేనీ కుమారుడు మొజబా ఖమేనీ త్వరలో ప్రజలముందుకు రానున్నారని తన తండ్రి స్మారక సభను ఈనెల 23వ తేదీన టెహరాన్‌లో నిర్వహిస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు. తన తండ్రి మరణానంతరం సుప్రీం నాయకునిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన ఇంతవరకూ ప్రజల ముందుకు రాలేదు. యుద్ధాన్ని కొనసాగించడం తమ అభీష్టం కాదని ఇరువర్గాల నాయకులు చెబుతున్నప్పటికీ, వారి చేష్టలు అందుకు అనుగుణంగా లేవు. ఈ విషయంలో ఎవరు ఎక్కువ, ఎవరి తక్కువ అనేది లేదు. ఈలోగా ట్రంప్ బాంబు లాంటి వార్తను వదిలారు. తన హత్యకు కుట్ర పన్నిందని ఇరాన్‌పై ఆరోపించారు. అయితే, ఇలాంటి కుట్రలకు తాను భయపడబోనని, హార్మూజ్ జలసంధిని ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలకు ఉపయోగకరంగా ఉండేట్టు తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని అన్నారు. ఒమన్‌కు సమీపంలో గల్ఫ్ దేశాల నౌకపై ఇరాన్ దాడి జరిపింది. సైప్రస్ పతాకం గల నౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళం దాడి జరిపింది.
దీనిపై అమెరికా మరింతగా విరుచుకుపడింది. హార్మూజ్‌ను మూసివేస్తామని ఇరాన్ ప్రకటించగా, హార్మూజ్ తెరిచే ఉందని అమెరికా ప్రకటించింది. జోర్డాన్‌పై కూడా ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతూ ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు జరపడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ వేసిన వలలో ఇరాన్ పడిపోయిందని పలువురు భావిస్తున్నారు. ఇరాన్ తాజా నిర్ణయంతో ఖతర్ సముద్ర కార్యకలాపాలను నిలిపివేయాలని వాణిజ్య నౌకల యాజమాన్యాలను ఆదేశించింది. ఇరాన్ సోమవారం ఉదయం కూడా ఖతర్‌పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిలో కొన్నింటిని ఖతర్ రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. ఈ దాడుల్లో కొందరు గాయపడ్డారు. ఇరాన్ దూకుడు దృష్ట్యా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తమ రక్షణ దళాన్ని ఖతర్ ఆదేశించింది. అమెరికన్ స్థావరాలపై దాడుల పేరిట తమ భూభాగంపై ఇరాన్ దాడులు జరపడాన్ని ఒమన్ తీవ్రంగా ఖండించింది. సామాజిక మాధ్యమం వేదికగా ఇరాన్ ప్రభుత్వానికి ఒమన్ నిరసన తెలిపింది. హార్మూజ్ జలసంధిపై చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రికి ఖతర్ ఆతిథ్యం ఇచ్చిన మరునాడే ఖతర్‌పై ఇరాన్ దాడి జరపడం గమనార్హం. బహ్రెయిన్‌లో కూడా క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని అప్రమత్తం చేస్తూ అక్కడి ప్రభుత్వం సైరన్లు మోగించింది. ఇరాన్ రివల్యూషనరీ దళంతో ఆ దేశానికే ముప్పు అని యునైటెడ్ కింగ్‌డమ్ హెచ్చరించింది. రివల్యూషనరీ గార్డ్స్ నుంచి ముప్పు పొంచి ఉందని యూకే హెచ్చరించింది. మొత్తం మీద పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడానికి అమెరికా ఎంత కారణమో, ఇరాన్ కూడా అంతే బాధ్యత వహించాల్సి ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
