సెటిలర్ల మొగ్గు అటే.. ఏపీలోనే ఓటు కొనసాగించేందుకు ఆసక్తి

సెటిలర్ల మొగ్గు అటే.. ఏపీలోనే ఓటు కొనసాగించేందుకు ఆసక్తి

  • ఏపీలో ‘సర్’ గడువు ముగియడంతో హైదరాబాద్‌లో ప్రభావం
  • రెండు రాష్ట్రాల్లో ఓట్లపై సెటిలర్లలో సందిగ్ధం
  • హైదరాబాద్‌లో ఓటర్ల మ్యాపింగ్ ఎందుకు వెనుకబడింది?
  • ఎరోనెట్‌తో డబుల్ ఓట్లపై ఎన్నికల సంఘం నిఘా
  • సెటిలర్ల ఓటు ఎటు..? రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ఏపీలో సర్కు ముగుస్తున్న గడువు తెలంగాణ మెడకు చుట్టుకుంటోంది. కొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్రోల్‌మెంట్ ప్రక్రియ ముగుస్తుండటంతో దీని ప్రభావం తెలంగాణలోని హైదరాబాద్‌పై తీవ్రంగా పడుతోంది. ఏపీలో ఓటు ఉంచుకోవాలా లేక తెలంగాణలోనా అన్న సందిగ్ధం తీరిపోనుంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతి నగర్, నిజాంపేట, మియాపూర్, బీహెచ్‌ఈఎల్, బాచుపల్లి, అశోక్‌నగర్, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, మాదాపూర్, శేరిలింగంపల్లి, మేడ్చల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఏపీ ఓటర్లు ఇప్పుడు తమ ఓటు ఎక్కడ ఉంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

ఈ కారణంగానే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో హైదరాబాద్ జిల్లా వెనుకబడి ఉంది. హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 46.79 లక్షల మంది ఓటర్లుండగా, వారిలో కేవలం 17.17 లక్షల (సుమారు 38.7 శాతం) మంది మాత్రమే విజయవంతంగా మ్యాపింగ్‌లో పాల్గొన్నారు. మిగిలిన దాదాపు 29.6 లక్షల మంది ఓటర్లు ఇంకా గుర్తింపు స్పష్టత లేనివిగా మిగిలిపోయారు. ఈ భారీ వ్యత్యాసం వల్లే హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు ప్రక్రియ పెద్ద ఎత్తున సాగే అవకాశం ఉందని చెబుతున్నారు.

తెలంగాణలో ఎన్రోల్‌మెంట్‌కు ఈ నెల 25 వరకు సమయం ఉండగా.. ఏపీలో మాత్రం ఈ నెల 14వ తేదీ సాయంత్రంతో ముగుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలోని ఆయా గ్రామాల నుంచి వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు, ప్రధాన పార్టీల రాజకీయ నాయకులు ఓటర్లకు ఫోన్లు చేసి అవగాహన కల్పిస్తున్నారు.

పందిగ్ధంలో సెటిలర్లు

ఏపీలో ఓటు ఉండి హైదరాబాద్‌లో స్థిర నివాసం ఉన్నవాళ్లు పునరాలోచనలో పడగా, తాత్కాలికంగా అవసరాలు, ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటూ సంక్రాంతి, దసరా పండగలకు సొంతూరు వెళ్లి వచ్చే వాళ్లు తెలంగాణలోనే ఓటు ఉంచుకోవాలని భావిస్తున్నారు. ఓటు లేకపోతే ఎవరు పట్టించుకుంటారనే భయం నెలకొంది. అలా అని ఏపీలో ఓటు లేకపోతే సొంతూరుతో… అక్కడి రాజకీయాలతో… అక్కడి వ్యవహారాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయనే భయం కూడా వెంటాడుతోంది.

ఇలా నగర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రావాసులు, ప్రధానంగా రెండు చోట్ల ఓట్లు ఉన్న ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌లోని ఆంధ్రా సెటిలర్లలో చాలా మంది తెలంగాణ, ఆంధ్రాలో రెండు చోట్లా ఓటు హక్కు వినియోగించుకుంటూ వచ్చారు. రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు తేలితే ఏడాది జైలు ఖాయమని తెలంగాణ ప్రధాన ఎన్నికల సంఘం ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ఒకచోటే ఓటు హక్కుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో… కొందరు ఆంధ్రా సెటిలర్లు హైదరాబాద్‌లో ఓటు వదిలేసుకోవడానికే ఆసక్తి చూపుతున్నారు.

ఎరోనెట్‌తో డబుల్ ఎంట్రీకి చెక్

ఎన్నికల కమిషన్ తాజాగా ‘ఎరోనెట్ ప్లాట్‌ఫామ్’ ఉపయోగిస్తోంది. దీని ద్వారా ఒక ఓటరుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు ఉందో లేదో సరిచూస్తారు. డూప్లికేట్ ఓట్లు, రెండు చోట్ల ఓటు ఉన్న వారిని ఆన్‌లైన్ ద్వారా సులభంగా గుర్తించి తొలగించేలా ఈసీ చర్యలు తీసుకోనుంది. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి వివరాలను కూడా దీని ద్వారా ధ్రువీకరిస్తారు.

గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరిగేవి. కొందరు రెండు చోట్ల ఓట్లు వేసేవారు. 2004, 2009లో తెలంగాణతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఓసారి, ఆంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు, రాయలసీమతో కలిపి మరోసారి ఎన్నికలు జరిగాయి. 2014లో తెలంగాణ జిల్లాల్లో ఎన్నికలు ముగిసిన వారం రోజుల అనంతరం ఆంధ్ర, రాయలసీమల్లో ఎన్నికలు జరిగాయి. దీంతో హైదరాబాద్‌లో ఓటున్న సీమాంధ్రులు తొలుత తెలంగాణలో ఓటు హక్కును వినియోగించుకుని, ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతంలో కూడా ఓటింగ్‌లో పాల్గొన్నారు.

ఇకపై ఇలా వీలు కాకుండా సర్ చర్యలు తీసుకుంటోంది. గతంలో రెండు చోట్ల ఓట్లు వినియోగించుకునే దాదాపు 18.50 లక్షల మంది ఓటర్లు ఎక్కడో ఒకచోటే ఓటు హక్కును వినియోగించాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీపై సీమాంధ్రులకు గతంలో ఉన్న ఆదరణ తగ్గిందని సీమాంధ్ర పార్టీల భావనగా ఉంది. ఇక్కడ ఓటు హక్కున్న 18.50 లక్షల మంది ఓటర్లు తమ ఓటును ఎక్కడ వినియోగించుకోనున్నారు…? ఎవరికి వేయనున్నారు…? వారి మద్దతు ఎవరికి…? ఇప్పుడివే ప్రశ్నలు రాజకీయ పార్టీల మెదళ్లను తొలుస్తున్నాయి.