కదిరి పట్టణ సీఐగా వెంకటేశ్వర్లు
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా వెంకటేశ్వర్లును నియమిస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కదిరి పట్టణ సీఐగా విధులు నిర్వహించిన డీవీ నారాయణరెడ్డిని అనంతపురం వీఆర్‌కు బదిలీ చేశారు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం పుట్టపర్తి స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ)లో విధులు నిర్వహిస్తుండగా, బదిలీపై కదిరికి వచ్చారు.
డీవీ నారాయణరెడ్డి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాం నుంచి కదిరి పట్టణ సీఐగా కొనసాగారు. ఆయన పదవీకాలంలో పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై నమోదైన పలు కేసులు చర్చనీయాంశంగా మారాయి.
అదేవిధంగా రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి, అవసరమైన చోట కొత్త రౌడీషీట్లు నమోదు చేయడంతో పాటు నేర కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. పలు కీలక కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి పోలీసు శాఖలో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నూతన సీఐ వెంకటేశ్వర్లు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన నాయకత్వంలో కదిరి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు మరింత ప్రాధాన్యం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక ప్రజలు, వ్యాపార వర్గాలు ఆయన బాధ్యతల స్వీకరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
