‘రేవంత్‌రెడ్డికి రక్తదానం’ పేరుతో బీఆర్‌ఎస్‌ వినూత్న నిరసన

వేములవాడ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మా రక్తం తీసుకొని మీ రక్తదాహం తీర్చుకోండి.. కానీ కళ్లముందే ఎండిపోతున్న పంటలను సాగునీరు అందించి రైతులను తక్షణమే ఆదుకోవాలని వేములవాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం వేములవాడలోని చల్మెడ నివాసంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ‘రేవంత్‌రెడ్డికి రక్తదానం’ పేరుతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చల్మెడ లక్ష్మీనరసింహారావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రక్తదానం చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌పై విమర్శలు గుప్పించారు. మంత్రి పదవి కోసం ఆది శ్రీనివాస్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ కక్షసాధింపు రాజకీయాలు మానుకుని, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు సాగునీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.