అచ్చంపేట డివిజన్‌లో మోస్తరు వర్షాలు
వర్షాలతో రైతుల్లో కొత్త ఆశలు.. ఊపందుకున్న వ్యవసాయ పనులు
అచ్చంపేట, ఆంధ్రప్రభ: అచ్చంపేట డివిజన్ పరిధిలో సోమవారం (ఆదివారం రాత్రి) పలుచోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. గత కొద్ది రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది.
వర్షపాతం నమోదుతో పంటలకు అవసరమైన తేమ అందడంతో రైతులు వెంటనే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
అధికారుల వివరాల ప్రకారం అచ్చంపేట మండలంలో 17.8 మిల్లీమీటర్లు, ఉప్పునుంతల మండలంలో 24.6 మిల్లీమీటర్లు, అమ్రాబాద్ మండలంలో 5.6 మిల్లీమీటర్లు, పదర మండలంలో 7.2 మిల్లీమీటర్లు, లింగాల మండలంలో 24.2 మిల్లీమీటర్లు, బల్మూర్ మండలంలో 9.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వర్షాలతో నేలలో తేమ శాతం పెరగడంతో రైతులు పత్తి పంట చేలలో అడుగుమందు, యూరియా, డీఏపీ ఎరువులు చల్లే పనులను ప్రారంభించారు. అలాగే కలుపు మొక్కలను తొలగించే పనులు చేపడుతున్నారు.
ఈ వర్షాలు పత్తితో పాటు ఇతర ఖరీఫ్ పంటలకు కూడా మేలు చేస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నమోదైన వర్షాలు పంటల ఎదుగుదలకు అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే తరహాలో మరో రెండు మూడు మంచి వర్షాలు కురిస్తే ఖరీఫ్ సాగుకు మరింత ఊతం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం వర్షాల కారణంగా అచ్చంపేట డివిజన్ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.
