60 లక్షల మొక్కల లక్ష్యం..

60 లక్షల మొక్కల లక్ష్యం..

హరిత జిల్లాగా శ్రీ సత్యసాయి రూపాంతరం!

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ ఎత్తున హరిత కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు.

పుట్టపర్తి సమీపంలోని ఎద్దులకొండ వద్ద నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు కలిపి సుమారు 500 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా 350 నుంచి 400 వరకు మొక్కలను నాటి హరితాభివృద్ధికి శ్రీకారం చుట్టారు.

జిల్లా వ్యాప్తంగా 159 ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించి, నర్సరీల నుంచి సుమారు 40 వేల మొక్కలను తరలించి నాటారు. ప్రజల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించేందుకు 10 వేల పండ్ల మొక్కలు, ఇతర వృక్ష జాతుల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో వీబీజీ (VBG-RAM G) పథకం కింద సుమారు 60 లక్షల మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతం పచ్చదనం సాధించే లక్ష్యానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

సామాజిక వన విభాగం ఆధ్వర్యంలో ఎద్దులకొండ పరిసర ప్రాంతాల్లో 40 వేల సీడ్ బాల్స్‌ను విస్తరించారు. అదేవిధంగా జిల్లాలో 5 లక్షల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

సామాజిక వన విభాగం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ జి. శ్రీనివాసులు మాట్లాడుతూ, 2030 నాటికి జిల్లాలో 33 శాతం పచ్చదనం సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నర్సరీల్లో 17 లక్షల మొక్కలు ప్రజలకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

వేప, వెదురు, రేల, చింత, శ్రీగంధం, రేగు, వెలగ, మారేడు, సీతాఫలం, ఉసిరి, మేడి, జువ్వి, రావి, మర్రి, నేరేడు తదితర వృక్ష జాతుల విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

“వృక్షో రక్షతి రక్షితః” అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ చక్రపాణి, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులు, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీడబ్ల్యూఎంఏ పీడీ విజయ్ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.