కూటమి ప్రభుత్వ విజయాలే మన బలం: మాజీ మంత్రి దేవినేని ఉమా

కూటమి ప్రభుత్వ విజయాలే మన బలం: మాజీ మంత్రి దేవినేని ఉమా

ఆంధ్రప్రభ, విజయవాడ: రాష్ట్రంలో రెండేళ్లుగా కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు సమర్థవంతంగా వివరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన క్లస్టర్ శిక్షణా తరగతుల్లో పాల్గొని ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతి, పార్టీ బలోపేతమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని కోరారు.

వైసీపీ తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందని, వాటిని వాస్తవాలతో సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు. కూటమి నేతలు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో, సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అప్పగించే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వాటి వివరాలను ‘మై టీడీపీ’ (My TDP) యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని దేవినేని ఉమా స్పష్టం చేశారు.