ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఎస్ఆర్‌హెచ్ అదిరే బోణీ చేసింది. హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఆర్ఆర్ పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన ఆరెంజ్ ఆర్మీ… 44 పరుగుల తేడాతో గెలిచింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసింది. నిర్ణీత ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.
కాగా, ఈ భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ పోరాడి ఓడింది. టాపార్డర్ లో జైస్వాల్ (1), కెప్టెన్ రియాన్ పరాగ్ (4), నితిష్ రాణా (11) విఫలమైనప్పటికీ… సంజు శాంసన్ (66) – ధ్రువ్ జురేల్ (70) చెరో అర్థశతకాలతో చెలరేగి ఆడారు.
వీరిద్దరూ ఔటన తరువాత క్రీజులోకి అడుగు పెట్టిన షిమ్రాన్ హెట్మెయర్ (42) – శుభం దూబే (34 నాటౌట్) కూడా దూకుడుగా ఆడుతూ బౌండరీలు తో విజృంభించారు. కానీ ఓవర్లు అయపోవడంతో.. రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసి 44 పరుగుల తేడాతో ఓడిపోయింది..
ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు ఊచకోత కోశారు. వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడి ఇషాన్ కిషన్ (106 నాటౌట్) సెంచరీతో గర్జించాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (67) హాఫ్ సెంచరీతో రాజస్థాన్ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఇక అభిషేక్ శర్మ (24), నితీష్ కుమార్ రెడ్డి (30), హెన్రిచ్ క్లాసెన్ (34) అద్భుతంగా రాణించారు. దీంతో కమ్మిన్స్ సేన్ ప్రత్యర్థి జట్టుకు 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.