శాస్త్రవేత్తల సూచనలతోనే అధిక దిగుబడులు
శాస్త్రవేత్తల సూచనలతోనే అధిక దిగుబడులు
- ఆత్మ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి
గట్టుప్పల, ఆంధ్రప్రభ: వ్యవసాయంలో ఆధునిక మెలకువలు పాటిస్తూ, శాస్త్రవేత్తల సూచనల మేరకు సాగు చేస్తే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఆత్మ మునుగోడు చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. భూమి రకాన్ని బట్టి విత్తనాలను ఎంపిక చేసుకోవాలని, ఒకే రకమైన పంటను కాకుండా పంట మార్పిడి పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు. అనంతరం శాస్త్రవేత్తలు డాక్టర్ రామకృష్ణ బాబు, సాయి ప్రియ రైతులకు సాగుపై కీలక సూచనలు చేశారు.
మోతాదుకు మించి ఎరువులు వాడకుండా, సరైన మోతాదులో వినియోగించి ఖర్చులు తగ్గించుకోవాలని, మార్కెట్ డిమాండ్‌ను బట్టి లాభదాయకమైన పంటలను ఎంపిక చేసుకోవాలని, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించే పద్ధతులపై అవగాహన కలిగి ఉండాలని సూచనలు చేశారు.
ఈ సదస్సులో ఏడీఏ వేణుగోపాల్, మండల వ్యవసాయ అధికారి రేవతి, సర్పంచ్ నామని జగన్నాథం, సింగం వెంకటేశం, ఉప సర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య, ఏఈఓలు కార్తీక్, రాకేష్ మరియు మండల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
