విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా..!

  • వసతి గృహంలో డీఎంహెచ్‌వో తనిఖీ
  • విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం
  • పరిశుభ్రత ప్రమాణాలను నిరంతరం పాటించాలని అధికారులకు ఆదేశం
  • జాయింట్ యాక్షన్ కమిటీతో కలిసి క్షేత్రస్థాయి తనిఖీలు

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ: విద్యార్థుల ఆరోగ్య రక్షణకు పరిశుభ్రమైన వాతావరణం అత్యంత అవసరమని, సంక్షేమ వసతి గృహాల్లో పారిశుద్ధ్య ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ. శ్రావణ బాబు అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులతో కలిసి పెనుగంచిప్రోలు బీసీ సంక్షేమ వసతి గృహాన్ని ఆయన సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, వంటశాల, తాగునీటి సౌకర్యాలు, పరిసర ప్రాంతాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు.

విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించే దిశగా పరిశుభ్రత ప్రమాణాలను నిరంతరం పాటించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. వసతి గృహాల్లో వ్యాధుల నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ తనిఖీలో ఎపిడెమియాలజిస్ట్ (ఇన్‌చార్జి), ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, ఆర్‌డబ్ల్యూఎస్, ఎంఈఓ, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. అలాగే జిల్లా మలేరియా అధికారి శ్రీను నాయక్, డాక్టర్ సునీల్, పెనుగంచిప్రోలు వైద్యాధికారి డాక్టర్ అంకితతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.