నిషేధిత గడ్డి మందు సీజ్

అనుమతులు, పత్రాలు లేకుండా పారాక్వాట్ డైక్లోరైడ్ తరలింపు
వాహన తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు

తాడ్వాయి, ఆంధ్రప్రభ : నిషేధిత గడ్డి మందును తాడ్వాయి ఎస్‌ఐ మధుకర్ పట్టుకుని సీజ్ చేశారు. తాడ్వాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాటాపూర్ క్రాస్ వద్ద పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహించారు.

తాడ్వాయి ఎస్‌ఐ మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో తాడ్వాయి మండల వ్యవసాయ అధికారి కాసాని సోమకుమార్, ఏఈఓ మల్లెల సందీప్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంగపేట మండలానికి చెందిన రోహిత్ ప్రభుత్వ నిషేధిత పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందును ఎలాంటి అనుమతులు, పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.

దీంతో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు కలిసి రోహిత్‌ను అదుపులోకి తీసుకుని నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రభుత్వం నిషేధించిన గడ్డి మందులను అక్రమంగా విక్రయించడం, రవాణా చేయడం లేదా వినియోగించడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.