పొలం వద్ద వ్యక్తి దారుణ హత్య.. ఆస్తి వివాదమే కారణమా?
- పక్కనే నాటు తుపాకీ
- బంధువులపైనే కుటుంబ సభ్యుల అనుమానం
పెద్దపంజాణి, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం మారప్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. పొలం వద్ద మృతదేహం లభించగా, పక్కనే నాటు తుపాకీ కనిపించడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
గ్రామానికి చెందిన మేకల రెడ్డప్ప కుమారుడు శ్రీనివాసులు (50) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాసులు రాత్రంతా తిరిగి ఇంటికి రాలేదు.
శుక్రవారం ఉదయం ఆవులకు మేత వేయడానికి పొలం వద్దకు వెళ్లిన ఆయన భార్య, శ్రీనివాసులు రక్తపు మడుగులో మృతదేహంగా పడి ఉండటాన్ని గమనించింది. మృతదేహం సమీపంలో నాటు తుపాకీ కూడా కనిపించడంతో ఆమె కేకలు వేయగా గ్రామస్థులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎస్సై సురేష్‌బాబు, సీఐ పరశురాముడు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై విచారణ ప్రారంభించారు.
మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం ఆస్తి వివాదాల నేపథ్యంలో తమ బంధువులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే హత్య వెనుక అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

