హైదరాబాద్ మహంకాళి ఆలయాలకు పట్టు వస్త్రాలు

  • భాగ్యనగరానికి కనకదుర్గమ్మ పట్టు వస్త్రాలు
  • బోనాల మహోత్సవాల సందర్భంగా సమర్పణ
  • ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు
  • పట్టు వస్త్రాలు సమర్పించిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసిద్ధ మహంకాళి ఆలయాలకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి నుంచి పట్టు వస్త్రాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రజలు సుఖశాంతులు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

శుక్రవారం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు, వేద పండితులు, దేవస్థాన అధికారులు హైదరాబాద్‌కు చేరుకుని ఉప్పుగూడ శ్రీ మహంకాళీ దేవాలయం, లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళీ దేవాలయం, గౌలిపురా శ్రీ మహంకాళీ దేవాలయం, సుల్తాన్‌షాహి శ్రీ జగదాంబ దేవాలయం, హరిబౌలిలోని శ్రీ బేల ముత్యాలమ్మ, శ్రీ బంగారు మైసమ్మ, శ్రీ అక్కన్న–మాదన్న దేవాలయాలు, మీర్‌ఆలంమండిలోని శ్రీ మహాంకాళేశ్వర దేవాలయాల్లో కొలువైన దేవతామూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మాట్లాడుతూ, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సస్యశ్యామలతతో వర్ధిల్లాలని అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ఈ పట్టు వస్త్రాలను సమర్పించినట్లు తెలిపారు. శక్తి స్వరూపిణులైన అమ్మవార్ల మధ్య కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక సంప్రదాయం తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక, భక్తి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల కమిటీ ప్రతినిధులు విజయవాడ దేవస్థానం బృందానికి ఘన స్వాగతం పలికి వివిధ ఆలయాలకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం దేవస్థానం తరఫున సమర్పించిన పట్టు వస్త్రాలను అమ్మవార్లకు అర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు ఎల్. దుర్గాప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు బడేటి ధర్మారావు, అవ్వారు శ్రీనివాసరావు, టి. హరికృష్ణ, పి. రాఘవరాజు, టి. వెంకట రమణారావు, వేద పండితులు, సూపరింటెండెంట్ డీవీవీ సత్యనారాయణ, ఫెస్టివల్ సెక్షన్ గుమాస్తా పి. శిరీషతో పాటు దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.