అస్మిత లీగ్లో జిల్లా క్రీడాకారిణుల సత్తా
- 2 రజతాలు.. 7 కాంస్య పతకాలతో మెరిసిన మహిళా అథ్లెట్లు
- పతక విజేతలకు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అభినందనలు
విజయవాడ, ఆంధ్రప్రభ : ఖేలో ఇండియా అస్మిత మహిళల లీగ్ దక్షిణ జోన్ పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారిణులు సత్తా చాటారు. రెండు రజత, ఏడు కాంస్య పతకాలు సాధించి జిల్లా, రాష్ట్ర ఖ్యాతిని పెంచారు. పతకాలు సాధించిన క్రీడాకారిణులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అభినందించారు.
విశాఖపట్నంలో జూలై 4, 5 తేదీల్లో నిర్వహించిన ఖేలో ఇండియా అస్మిత మహిళల లీగ్–దక్షిణ జోన్ 2026 పోటీల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కేరళ, మణిపూర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మహిళా క్రీడాకారిణులు పాల్గొన్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా జట్టు అద్భుత ప్రతిభ కనబరిచింది. రెండు రజత పతకాలు, ఏడు కాంస్య పతకాలు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. పతక విజేతలను బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి జిల్లా, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలి
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యే క్రీడాకారిణులు మరింత పట్టుదలతో సాధన చేసి విజయాలు సాధించాలని కలెక్టర్ సూచించారు. మహిళలు క్రీడల్లో, ముఖ్యంగా జల క్రీడల్లో మరింతగా రాణించేలా శిక్షణ, ప్రోత్సాహంతో పాటు అవసరమైన సహకారం అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు.
జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె. కోటేశ్వరరావు నాయకత్వం, శిక్షకులు ఎం. శ్రీను, చందూరి తేజ అందించిన నాణ్యమైన శిక్షణ, నిరంతర మార్గదర్శకత్వం క్రీడాకారిణుల విజయానికి కీలకంగా నిలిచాయని అధికారులు పేర్కొన్నారు.
ఖేలో ఇండియా అస్మిత మహిళల లీగ్ పోటీలను ఉత్తర, దక్షిణ జోన్లలో నిర్వహిస్తున్నారు. జోనల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులను ఆగస్టు 2026లో మధ్యప్రదేశ్లో జరగనున్న ఖేలో ఇండియా అస్మిత మహిళల లీగ్ జాతీయ ఛాంపియన్షిప్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేయనున్నారు.
కార్యక్రమంలో జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
