మైనార్టీల అభ్యున్నతికి ఎంపీ చిన్ని కృషి అభినందనీయం

  • పార్లమెంట్‌లో సమస్యలు ప్రస్తావించి కేంద్రం స్పందించేలా చేసిన కేశినేని శివనాథ్‌
  • ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎంఎస్ బేగ్
  • మైనార్టీ సంక్షేమ ప్రాజెక్టులకు రూ.7.5 కోట్లతో పనులు ప్రారంభించనున్న కేంద్రం
  • నిలిచిపోయిన ఏడు ప్రధాన ప్రాజెక్టులకు రూ.101 కోట్ల నిధుల హామీ
  • మైనార్టీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎంఎస్ బేగ్

విజయవాడ, ఆంధ్రప్రభ: పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ మైనార్టీల సమస్యలను ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించిన విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) కు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా నిధుల కొరత కారణంగా మైనార్టీ సంక్షేమానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు, పాఠశాలలు, రహదారులు, తాగునీటి సదుపాయాల పనులు నిలిచిపోవడంతో ముస్లిం సమాజం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ఈ సమస్యలను పార్లమెంట్‌లో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రస్తావించడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి సుమారు రూ.7.5 కోట్ల వ్యయంతో మైనార్టీ ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించేందుకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో నిలిచిపోయిన ఏడు ప్రధాన మైనార్టీ ప్రాజెక్టులకు రూ.101 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించేందుకు కేంద్రం హామీ ఇవ్వడం మైనార్టీల అభ్యున్నతికి శుభపరిణామమని ఎంఎస్ బేగ్ అన్నారు.

ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే విద్య, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడి ముస్లిం సమాజ అభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కి, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ కృతజ్ఞతలు తెలిపారు.