Hockey Under-18 Asia Cup | సెమీస్ లో పాకిస్థాన్ చిత్తు.. ఫైనల్స్ కు యువ భారత్..
Hockey Under-18 Asia Cup | సెమీస్ లో పాకిస్థాన్ చిత్తు.. ఫైనల్స్ కు యువ భారత్..
- ఆశిష్ సూపర్ షో..
- పాకిస్థాన్‌పై 5-3తో భారత్ విజయం
- జపాన్‌తో టైటిల్ ఫైట్
అండర్-18 ఆసియా కప్ 2026లో భారత యువ హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 5-3 తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది యువ భారత్.
మ్యాచ్‌లో మూడు క్వార్టర్ల ముగిసే సమయానికి భారత్ 2-3తో వెనుకబడి ఉండగా, చివరి క్వార్టర్‌లో అద్భుతంగా పుంజుకుని వరుసగా మూడు గోల్స్ చేసి మ్యాచ్‌ను తనవైపు తిప్పుకుంది. భారత విజయంలో ఆశిష్ తాని పుర్తి హీరోగా నిలిచాడు. ఏకంగా నాలుగు గోల్స్ సాధించి పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లాడు.
మొదటి క్వార్టర్‌లో 12వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచిన ఆశిష్ భారత్‌కు ఆధిక్యం అందించాడు. అయితే రెండో క్వార్టర్‌లో పాకిస్థాన్ సమం చేసింది. మూడో క్వార్టర్‌లో షారుఖ్ అలీ గోల్‌తో భారత్ మళ్లీ ముందంజలోకి వెళ్లినా, పాకిస్థాన్ వరుసగా రెండు గోల్స్ చేసి 3-2 ఆధిక్యం సాధించింది.
చివరి క్వార్టర్‌లో మాత్రం భారత ఆటగాళ్లు దూకుడు పెంచారు. 49వ నిమిషంలో ఆశిష్ గోల్‌తో స్కోరు 3-3గా మారింది. అనంతరం 53వ నిమిషంలో మరో గోల్ సాధించి హ్యాట్రిక్ పూర్తి చేసిన ఆశిష్ భారత్‌ను 4-3తో ముందంజలో నిలిపాడు. మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాల ముందు మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి తన నాలుగో గోల్ నమోదు చేశాడు. దీంతో భారత్ 5-3తో ఘన విజయం సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో భారత్ జపాన్‌తో తలపడనుంది. టైటిల్ పోరులోనూ ఇదే జోరు కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మహిళల జట్టుకు నిరాశ..
మరోవైపు మహిళల అండర్-18 ఆసియా కప్ సెమీఫైనల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. చైనాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో 2-2తో సమంగా నిలిచిన భారత్.. షూటౌట్‌లో 1-3తో ఓటమిపాలైంది. దీంతో భారత్ ఫైనల్ అవకాశాన్ని కోల్పోయి కాంస్య పతక పోరుకు పరిమితమైంది. శనివారం జరిగే మూడో స్థానం మ్యాచ్‌లో భారత్ కొరియాతో తలపడనుంది.

