దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు స్వాగతం.. తిరుపతి డివిజన్ ఏర్పాటు చేయాలి

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు స్వాగతం.. తిరుపతి డివిజన్ ఏర్పాటు చేయాలి
తిరుపతి, ఆంధ్రప్రభ:
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం భారతీయ రైల్వేలో దక్షిణ కోస్తా విశాఖపట్నం 18వ రైల్వే జోన్ అధికారిక కార్యక్రమాలు ప్రారంభం కావడం పట్ల తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి హర్షం వ్యక్తం చేసింది. అదే సమయంలో కొత్త జోన్‌లో ఐదో డివిజన్‌గా తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి పిలుపు మేరకు సోమవారం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. అలిపిరి పాదాల మండపం, తిరుపతి, తిరుచానూరు, రేణిగుంట, రైల్వేకోడూరు, పాకాల, చిత్తూరు తదితర ప్రాంతాల్లో అధికారులకు వినతులు సమర్పించారు.
అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద సమితి నాయకులు వేణుగోపాల్ రెడ్డి, సీహెచ్‌వీ శేషగిరిరావు, పుష్పరాజ్, వై.ఎస్. బాబు, నీలేష్ కుమార్, నీలాద్రి అశోక్ బాబు, తదితరులు కొబ్బరికాయలు సమర్పించారు. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతూ ప్రార్థనలు చేశారు.
తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ సుదర్శన ఆదర్శ ఆటో స్టాండ్ అధ్యక్షుడు ఐఎస్ ఖాజా ఆధ్వర్యంలో బాలాజీ రెడ్డి, రమణ, రాజేష్, ఆటో డ్రైవర్లు స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ర్యాలీ నిర్వహించి తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు.
తిరుచానూరు రైల్వే స్టేషన్ వద్ద నవీన్, ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో, రేణిగుంటలో జయంత్ కుమార్, నాగేంద్ర, మునిరత్నం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. రైల్వేకోడూరులో నరహరి ప్రసాద్, నవీన్, కుప్పాల జ్యోతి, పెంచలయ్య, పాకాల రైల్వే స్టేషన్ వద్ద బుచ్చిబాబు నాయుడు, వెంకటేష్, రాధాకృష్ణ, చిత్తూరు రైల్వే స్టేషన్ వద్ద శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ, బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని నాయకులు నినాదాలు చేశారు.
ఐదో డివిజన్‌గా తిరుపతిని ఏర్పాటు చేయాలి
ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో ఐదో డివిజన్‌గా తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తిరుపతి, చిత్తూరు, రేణిగుంట, పాకాల, కోడూరు ప్రాంతాల ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష అయిన ఈ డివిజన్ సాధనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్రంతో చర్చించాలని కోరారు.
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు వల్ల తిరుపతి పరిసర ప్రాంతాలు ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
రైల్వే రవాణా వ్యవస్థ విస్తరించి, మరిన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. దీని వల్ల ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల అవసరాలకు అనుగుణంగా అదనపు బోగీలు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభతరం కావడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. స్థానిక వ్యాపారులు, చిన్న వ్యాపారులు, యాత్రికులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలకు ఈ డివిజన్ ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సమితి నాయకులు తెలిపారు.
తిరుపతికి అన్ని అర్హతలు ఉన్నాయి
తిరుపతి వెస్ట్, తిరుచానూరు, చంద్రగిరి, పాకాల రైల్వే స్టేషన్ల పరిధిలో రైల్వే శాఖకు అవసరమైన భూములు ఉన్నాయని సమితి నాయకులు వివరించారు. ఏ వన్ కేటగిరీ స్టేషన్లైన తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్ల నుంచి ప్రతి ఏడాది రూ.450 కోట్ల ఆదాయం రైల్వే శాఖకు లభిస్తోందని తెలిపారు.
ప్రస్తుతం గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో 350 కిలోమీటర్ల దూరంలో తిరుపతి రైల్వే స్టేషన్ ఉండడంతో పరిపాలనపరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
అన్ని రకాల అర్హతలు ఉన్న తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమ ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. రైల్వే శాఖకు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమలకు వచ్చే భక్తులకు కూడా ఇది లాభదాయకమని పేర్కొన్నారు.
అమరావతి ప్రాంతంలో రెండు రైల్వే డివిజన్లు, విశాఖపట్నంలో జోనల్ కార్యాలయం, డివిజన్ కార్యాలయం ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో మూడవ అతిపెద్ద నగరమైన తిరుపతిలో ఎలాంటి డివిజన్ లేదా జోనల్ కార్యాలయం లేకపోవడం ప్రాంతీయ అసమానతలకు నిదర్శనమని సమితి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాంతీయ సమతుల అభివృద్ధి కోసం తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు అత్యవసరమని వారు డిమాండ్ చేశారు. వెనుకబడిన రాయలసీమకు, ఈ ప్రాంత ఉద్యానవన పంటల రైతాంగానికి రైల్వేపరంగా నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.
బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించాలని సమితి నాయకులు పిలుపునిచ్చారు.
