South Coast Railway Zone | రైల్వే జోన్‌తో ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు

South Coast Railway Zone | రైల్వే జోన్‌తో ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపు

South Coast Railway Zone | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్‌ కల ఎట్టకేలకు సాకారమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు కావడం ప్రాంత ప్రజల విజయమని పేర్కొన్నారు. ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాల పోరాట ఫలితమని రామ్మోహన్‌ నాయుడు అన్నారు. రైల్వే జోన్‌ కోసం పార్లమెంట్‌లో నిరంతరం గళం విప్పానని, ప్రజల ఆకాంక్షలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. కొత్త జోన్‌తో లక్షలాది మంది ప్రయాణికులకు మెరుగైన సేవలు అందడంతో పాటు ప్రాంత అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.

ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌ను రూ.12 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఇచ్ఛాపురం బ్రిడ్జి సమస్యతో పాటు అండర్‌బ్రిడ్జి నిర్మాణంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. ‘‘ఇచ్ఛాపురం రాష్ట్రానికి మూలన ఉన్న ప్రాంతం కాదు.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు ముఖద్వారంగా మారబోతోంది’’ అని అన్నారు.

ఈ సందర్భంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉత్తరాంధ్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే రంగం అభివృద్ధి చెందితే ఉత్తరాంధ్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.