రైల్వే కొత్త లోగో ఆవిష్కరణ..
- మహిళా సాధికారతకు కొత్త గుర్తింపు
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : సౌత్ కోస్ట్ రైల్వే మహిళా సంక్షేమ సంస్థ విజయవాడ డివిజన్ తన అధికారిక లోగోను ఘనంగా ఆవిష్కరించింది. మహిళల సంక్షేమం, సాధికారతకు కొత్త దిశను సూచించే ఈ లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ లోగోను మహిళ సంక్షేమ రైల్వే అధ్యక్షురాలు స్మతి చారు మాథుర్ ఆవిష్కరించగా, కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ స్మతి అంజు గుప్తా, విజయవాడ డివిజన్ అధ్యక్షురాలు స్మతి వర్షా సోనాకియా, ఇతర సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.
కొత్తగా రూపొందించిన లోగోలో మహిళ ముఖచిత్రాన్ని సహాయక హస్తం ఆధారంగా వృత్తాకారంలో చూపించడం ద్వారా శక్తి, గౌరవం, సంరక్షణ, ఐక్యత వంటి విలువలను ప్రతిబింబించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది రైల్వే కుటుంబంలోని మహిళల సాధికారతకు సంస్థ కట్టుబాటును సూచిస్తుందని వారు వివరించారు.
ఈ సందర్భంగా స్మతి చారు మాథుర్ మాట్లాడుతూ, ఈ లోగో కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, ప్రతి మహిళలోని శక్తి, ఐక్యత, సేవాభావాన్ని ప్రతిబింబించే ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం సంస్థ మరింత విస్తృతంగా పనిచేయాలన్న సంకల్పానికి ఇది నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
లోగోలో “విజయవాడ” పేరును చేర్చడం ద్వారా సౌత్ కోస్ట్ రైల్వే ప్రాంతీయ గుర్తింపును మరింత బలోపేతం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ లోగోలో సంక్షిప్త రూపం సంస్థ లక్ష్యం, ఉనికిని స్పష్టంగా ప్రతిబింబిస్తుందని చెప్పారు. కార్యక్రమం సంస్థ సభ్యుల కృషిని ప్రశంసిస్తూ, ఈ కొత్త లోగో విజయవాడ డివిజన్‌లో సేవా ప్రయాణంలో కొత్త అధ్యాయానికి ప్రారంభమని పేర్కొన్నారు.
