భద్రాచలం – ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజుల భద్రాచలం పర్యటన రద్దైంది. రేపు సీతారాముల కళ్యాణం సందర్భంగా ఇవాళ, రేపు పవన్ కళ్యాణ్ భద్రాచలంలో ఉండాలనుకున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ హైదరాబాద్ మాదాపూర్ లోని తన నివాసం నుంచి బయల్దేరి సాయంత్రం గం.5 కి పవన్ భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. రాత్రి భద్రాచలంలో బస చేసి, రేపు స్వామివారి కళ్యాణం సందర్భంగా ఉత్సవానికి హాజరై ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను సీతారాములకి సమర్పించాలన్నది షెడ్యూల్ లోని ప్లాన్.
ఇక రేపు సాయంత్రం 5 గంటలకు భద్రాచలం నుంచి తిరుగుపయనమై, రేపు రాత్రి 10 గంటలకు హైదరాబాద్ లోని నివాసానికి చేరుకోవాలని మొదట భావించారు. అయితే, ఈ పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందేమోనని భావించి పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు భావిస్తున్నారు. పర్యటన రద్దుకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగానికి వర్తమానం పంపించారు.