జంక్షన్ల అభివృద్ధి ,విస్తరణ పనుల కోసం స్థల పరిశీలన

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : భూపాలపల్లి పట్టణంలో జంక్షన్ల అభివృద్ధి ,రోడ్లు విస్తరణ పనుల కోసం మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొంరయ్య గౌడ్ స్థానిక అధికారులతో శుక్రవారం స్థలాలను పరిశీలించారు. పట్టణంలోని ఎన్ హెచ్ ఫై ఉన్న సర్వాయి పాపన్న, జయశంకర్, అంబేద్కర్, రాజీవ్ జంక్షన్ లను విస్తరించేందుకు పరిశీలించారు. అలాగే నాలుగు జంక్షన్ లతోపాటు అంబేద్కర్ సెంటర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం స్థలాల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.

జంక్షన్ల అభివృద్ధితో పాటు రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టి షాపింగ్ నిర్మించి చిరు వ్యాపారులకు అందించడం జరుగుతుందన్నారు. అలాగే పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహాయ సహకారాలతో పట్టణంలో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని అందుకోసమే స్థల పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు .రానున్న రోజుల్లో అభివృద్ధి పనులు చేపట్టే పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొడ్డు అశోక్, బౌతు శోభా రాజేష్, రాజు నాయక్, మున్సిపల్ ఏఈ మానస, డిపిఓ సునీల్ కుమార్, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.