నేతన్న అద్భుతం…

  • అగ్గిపెట్టెలో ఇమిడే చేనేత చీర..
  • సిరిసిల్ల నేతన్న అరుదైన రికార్డు
  • 170 నిమిషాల్లో చీర నేసి రికార్డు..
  • గిన్నిస్ లక్ష్యంగా హరిప్రసాద్

రాజన్న సిరిసిల్ల, ఆంధ్రప్రభ : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ అరుదైన ప్రతిభను ప్రదర్శించారు. భారతీయ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో సంప్రదాయ మగ్గంపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరను అత్యంత వేగంగా నేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

రికార్డు స్థాయిలో 3 గంటల 30 నిమిషాల (210 నిమిషాలు) లక్ష్యంతో ప్రారంభించిన ఆయన, కేవలం 2 గంటల 50 నిమిషాల్లో (170 నిమిషాలు) చీర నేసి తన లక్ష్యాన్ని అధిగమించారు.

ఈ చీరను 1,500 వార్ప్ పోగులు, 10,500 వెఫ్ట్ పోగులతో నేసి, కేవలం 170 గ్రాముల బరువుతో రూపొందించారు. చీర పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 45 అంగుళాలు ఉండగా, ప్రత్యేక నైపుణ్యంతో మడిచి 12 సెం.మీ. పొడవు, 6.5 సెం.మీ. వెడల్పు, 2.5 సెం.మీ. ఎత్తు గల సాధారణ అగ్గిపెట్టెలో అమర్చడం విశేషం.

ఈ వినూత్న ప్రదర్శన ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని హరిప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ఈ రికార్డు వివరాలను లిమ్కా బుక్ ప్రతినిధులకు పంపించినట్లు వెల్లడించారు.