ఎస్.ఐ.ఆర్ ను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

ఎస్.ఐ.ఆర్ ను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు.
గొల్లపూడిలో టీడీపీ మండల సమావేశం.
ఎస్.ఐ.ఆర్‌పై శ్రేణులకు దిశానిర్దేశం.

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ రూరల్ తెలుగుదేశం మండల పార్టీ సమావేశం జరిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్)పై నిర్వహించిన అవగాహన సమావేశంలో మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ ప్రతి బూత్‌లో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలించాలని బీఎల్ఏ-2లకు సూచించారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను నమోదు చేయించి, మరణించిన, వలస వెళ్లిన వారి పేర్లు తొలగించాలన్నారు. దొంగ ఓట్లు, తప్పుడు నమోదులు లేకుండా పారదర్శక ఓటర్ల జాబితా రూపొందించాలని కోరారు. బూత్, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జ్‌లు సమన్వయంతో పనిచేసి ఎస్.ఐ.ఆర్ 100% పూర్తి చేయాలన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే ఎన్నికల్లో విజయం సులువుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. మండలంలోని అభివృద్ధి, సంక్షేమ పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ, ఫారం-6, 7, 8ల వినియోగంపై వివరించారు. అనంతరం మండలంలో పార్టీ బలోపేతంపై నాయకులతో ఎమ్మెల్యే చర్చించారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.