ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాల ఆరోపణలు..

  • లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలపై విమర్శలు

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలం నిజం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక నిధుల మంజూరులో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మండలంలో అన్ని గ్రామాల్లో ఇప్పటికే 30 వేల నుండి 50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అనర్హులకు ఇల్లు మంజూరు చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టును సైతం చేరాయి.

రెండో విడతలో పేరు కోసం వసూళ్లు..

ఇందిరమ్మ ఇల్లు రావాలంటే ముందస్తుగా డబ్బులు ఇవ్వాలని పలుచోట్ల వసూళ్లకు
పాల్పడుతున్నారని నిజమైన నిరుపేదలకు న్యాయం జరగడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండో విడతలో పేరు కోసం ఇందిరమ్మ కమిటీల స్థాయిలో సిఫార్సులు చేయడానికి పేర్లను తుది జాబితాలో చేర్చడానికి కొంతమంది నాయకులు అధికారులు లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వీటిని నివారించేందుకు ప్రభుత్వం సైతం టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్న అక్రమాలు ఆగడం లేదని తెలుస్తుంది. వసూళ్ల పర్వంలో ప్రధానంగా అధికార పార్టీ నాయకులు ఉన్నట్లు సమాచారం. ఇండ్ల నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇప్పిస్తున్నామని పార్టీ కోసం పని చేసే మాకు యాబైవేలని వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్న పథకాలను కొందరు స్వార్ధ నాయకులు అధికారులు డబ్బుల కోసం పనిచేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా మరింత నిష్పక్షికపాతంగా ఇందిరమ్మ పథకాన్ని నిరుపేదలకు అందించేలా ప్రభుత్వం పనిచేయాలని అర్హులైన పేదలు కోరుతున్నారు.