ఎండలను లెక్కచేయని భక్తి..

ఎండలను లెక్కచేయని భక్తి..

ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ
కనకదుర్గమ్మ దర్శనానికి పోటెత్తుతున్న భక్తజనం
క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు
దేవస్థానం ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీటి పంపిణీ
భక్తుల సౌకర్యాలకు ప్రత్యేక చర్యలు చేపట్టిన ఆలయ అధికారులు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.

గురువారం ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. క్యూలైన్లలో వేచి ఉండి భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కార్యనిర్వహణ అధికారి ఆదేశాల మేరకు క్యూలైన్ల వద్ద, ప్రధాన మార్గాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి నిరంతరాయంగా మజ్జిగ, మంచినీటిని అందిస్తున్నారు.

మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా కూడా భక్తులకు తాగునీటి సరఫరా కొనసాగుతోంది. భక్తుల సౌకర్యాలు, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఎండల తీవ్రత మధ్య కూడా కనకదుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో ఆలయ పరిసరాలు భక్తినాదాలతో మార్మోగుతున్నాయి.

Leave a Reply