cr rupees | హెలికాప్టర్లకు డబ్బులున్నాయి.. అంబులెన్స్‌లకు లేవా..?

cr rupees | హెలికాప్టర్లకు డబ్బులున్నాయి.. అంబులెన్స్‌లకు లేవా..?

cr rupees | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి దారుణంగా దిగజారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బతికున్నప్పుడు అండ దొరకకపోగా.. చనిపోయిన తర్వాత కూడా కనీస గౌరవం దక్కని పరిస్థితికి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని మండిపడ్డారు.

కేసీఆర్ పాలనలో పేదవాడి ఆఖరి ప్రయాణం కూడా గౌరవంగా సాగాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పార్థివదేహాల తరలింపు వాహనాలు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. “అది మానవత్వం.. అది ప్రజల గౌరవాన్ని కాపాడే సంకల్పం” అని అన్నారు.

కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో కుటుంబ సభ్యులే మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి రావడం తెలంగాణ ఆత్మగౌరవానికే మచ్చ అని విమర్శించారు. ప్రచారాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం.. ప్రజలకు అవసరమైన కనీస అత్యవసర సేవలు అందించలేకపోవడం సిగ్గుచేటని ప్రశ్నించారు.

రాజకీయ ప్రతీకారాలు, ప్రచార హడావుడి తప్ప ప్రజల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ ప్రతి పేద కుటుంబం గౌరవంగా జీవించాలని పాలన నడిపించారని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు మళ్లీ అవస్థల తెలంగాణను చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇదేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు..? ఇదేనా ప్రజలకు ఇచ్చిన హామీల ఫలితం..? తెలంగాణ ప్రజల గౌరవాన్ని వీధుల్లో మోసుకెళ్లడానికేనా ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ప్రజలు..? అంటూ నిలదీశారు.

జోడో యాత్రలకు బస్సులు, ఎన్నికల ప్రచారాలకు ప్రభుత్వ వనరులు, మంత్రులకు హెలికాప్టర్లు అందుబాటులో ఉంటే.. పేదవాడి చివరి ప్రయాణానికి కనీస గౌరవం ఉండకూడదా అని ప్రశ్నించారు. ఇది కేవలం ఒక కుటుంబం బాధ కాదు.. తెలంగాణ సమాజాన్ని కలచివేసే విషాదమని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply