స్వయం సహాయక సంఘాలు పొదుపును అలవాటు చేసుకోవాలి..

మెప్మా స్టేట్ మిషన్ కో – ఆర్డినేటర్ వెంకట నారాయణ రెడ్డి


ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రతి స్వయం సహాయక సంఘం తమ ఆదాయం, ఖర్చులను క్రమబద్ధంగా నిర్వహించి పొదుపును అలవాటు చేసుకోవాలని మెప్మా స్టేట్ మిషన్ కో – ఆర్డినేటర్ వెంకట నారాయణ రెడ్డి సూచించారు. కొండపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో మన డబ్బులు – మన అప్పులు డిజిటల్ యాప్ ద్వారా రిసోర్స్ పర్సన్లకు, ఆఫీస్ బేరర్లకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధిక వడ్డీతో ప్రైవేట్ అప్పులకు దూరంగా ఉండి అవసరమైనప్పుడు మాత్రమే బ్యాంకులు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థల ద్వారానే రుణాలు పొందాలని కోరారు. సంఘాల లెక్కలు పారదర్శకంగా ఉంటాయన్నారు. కనుక సంఘాలలో ప్రతి మహిళ చూసుకునే అవకాశం ఉంటుందని, తప్పులు లేకుండా ఉన్నది ఉన్నట్లు యాప్ లో నమోదు చేయాలన్నారు.

మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ… ప్రభుత్వం అందిస్తున్న ప్రతి కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలు భాగస్వామ్యం కావడం అదృష్టమన్నారు. ప్రతి సంఘాల వివరాలు డిజిటల్ యాప్ లో నమోదు చేయాలన్నారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ మురళీకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు తమ కుటుంబ ఆర్థిక వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేసుకోవడం ద్వారా ఆర్థిక ప్రణాళికను మెరుగుపర్చుకోవచ్చన్నారు.తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం, అనవసర ఖర్చులను తగ్గించడం, పొదుపు సాంస్కృతిని పెంపొందించడం ద్వారా కుటుంబ ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసులు, పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలు సిహెచ్.వెంకటేశ్వరమ్మ, కౌన్సిలర్ వాసు, డీపీఎంయూ టీఈ సుగుణ, ఆర్పీలు, టీఎల్ఎఫ్ ఓబీలు పాల్గొన్నారు.