వాకింగ్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

ఇల్లెందు, ఆంధ్రప్రభ : ఇల్లెందులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సింగరేణి డైమండ్ గ్రౌండ్‌లో ఉదయం వాకింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే, పాత బస్టాండ్ సెంటర్‌లో పాన్ షాప్ నడుపుకుంటున్న కేరళకు చెందిన ప్రకాష్ (48) గురువారం ఉదయం ప్రతిరోజులాగే వాకింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కిందపడిపోయారు. ఆ సమయంలో ఆయన భార్య, స్నేహితులు పక్కనే ఉన్నారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కేరళ నుంచి ఉపాధి కోసం ఇల్లెందుకు వచ్చి పాన్ షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ప్రకాష్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య కళ్లముందే భర్త మృతి చెందడంతో ఆమె విలపించిన తీరు హృదయ విదారకంగా మారింది. ప్రకాష్ మృతి పట్ల పట్టణ ప్రముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు సంతాపం వ్యక్తం చేసి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply