Telangana Schools Reopen | పౌష్టిక విప్లవంగా బ్రేక్‌ఫాస్ట్ పథకం

Telangana Schools Reopen | పౌష్టిక విప్లవంగా బ్రేక్‌ఫాస్ట్ పథకం

Telangana Schools Reopen | అమావాస్య సెంటిమెంట్‌తో సంశయంలో తల్లిదండ్రులు
1.44 లక్షల విద్యార్థులకు గేమ్‌చేంజింగ్ బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
ఆర్టీసీ బడి బస్సులతో సురక్షిత రవాణాకు భారీ ఏర్పాట్లు
ఫిట్‌నెస్ లేని బస్సులపై ఆందోళనకర నివేదిక

Telangana Schools Reopen | హైదరాబాద్, ఆంధ్రప్రభ: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. అయితే, కొత్త విద్యా సంవత్సరం మొదటి రోజే అటు సెంటిమెంట్, ఇటు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకానికి వేదికైంది. సోమవారం అమావాస్య కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సంశయం నెలకొనగా, అదే రోజున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనుంది.


అమావాస్య సెంటిమెంట్!

తెలుగు రాష్ట్రాల్లో అమావాస్యనాడు కొత్త పనులు ప్రారంభించడానికి చాలామంది విముఖత చూపుతారు. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరం మొదటి రోజే అమావాస్య రావడంతో తమ పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు సంశయంలో ఉన్నారు. అమావాస్య సెంటిమెంట్‌తో పాటు, జూన్ 17న మొహరం సెలవు ఉండటంతో చాలామంది జూన్ 18 నుంచే పిల్లలను పాఠశాలలకు పంపాలని భావిస్తున్నారు. దీనివల్ల తొలిరోజు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ముందుకు వెళ్తోంది.


1.44 లక్షల మందికి బ్రేక్‌ఫాస్ట్..

ప్రజల సెంటిమెంట్లు ఎలా ఉన్నా, విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారమే లక్ష్యంగా ప్రభుత్వం సోమవారం నుంచి బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తోంది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1,269 పాఠశాలలు, 33 జూనియర్ కాలేజీల్లో ఈ పథకం ప్రారంభం కానుంది. దీని ద్వారా 1,44,610 మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం వేడివేడి అల్పాహారం అందనుంది.

భవిష్యత్తులో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు చదివే 22 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని విస్తరించనున్నారు. అల్పాహారం కోసం రూ.540 కోట్లు, పాల కోసం రూ.180 కోట్లు వెచ్చించనున్నారు. వారంలో మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావ అందిస్తారు. హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ట్రస్ట్, మన్నా ట్రస్టుల సహకారంతో 8 జిల్లాల్లో ఈ పథకం అమలవుతోంది. ఇందుకోసం రూ.299.90 కోట్లతో కేంద్రీకృత కిచెన్లను నిర్మిస్తున్నారు.

విద్యార్థులకు బోర్ కొట్టకుండా రోజుకో రకమైన అల్పాహారాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. దోశ, మిల్లెట్ ఇడ్లీ, పూరీ, బోండా, ఉప్మా వంటి పదార్థాలను సాంబార్ లేదా చట్నీతో వడ్డిస్తారు. ఇప్పటివరకు పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని సోమవారం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని 1.70 లక్షల మంది విద్యార్థులకు కూడా విస్తరిస్తున్నారు. మొత్తానికి, అమావాస్య సెంటిమెంట్ కారణంగా తొలిరోజు విద్యార్థుల సందడి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం పకడ్బందీ ఏర్పాట్లతో విద్యా సంవత్సరాన్ని, అల్పాహార పథకాన్ని ఒకేసారి ప్రారంభించేందుకు సిద్ధమైంది.


నేటి నుంచే ఆర్టీసీ బడి బస్సులు

సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని బడి బస్సులు నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి అన్ని రీజియన్ అధికారులను ఆదేశించారు. అన్ని రీజియన్ల అధికారులు, డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆయన సూచించారు. గతంలో నడిపిన అన్ని స్కూల్ రూట్లను విధిగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. అవసరమైన చోట అదనపు ట్రిప్పులు నడపాలని ఆదేశించారు.


ఫిట్‌నెస్ లేని బస్సులు 2,955

రాష్ట్రంలో విద్యాసంస్థల బస్సులు మొత్తం 25,987 ఉండగా, వాటిలో 23,032 వాహనాలకు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయి. మిగిలిన 2,955 వాహనాలు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా నడుస్తున్నట్లు రవాణాశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. జిల్లాల వారీగా రంగారెడ్డి జిల్లాలో 444, మేడ్చల్-మల్కాజిగిరిలో 419, సంగారెడ్డిలో 140, హైదరాబాద్‌లో 138 వాహనాలకు ఫిట్‌నెస్ లేదు. అలాగే వికారాబాద్‌లో 150, ఖమ్మంలో 135, హనుమకొండలో 115, నల్గొండలో 115, కరీంనగర్‌లో 109, నిజామాబాద్‌లో 104 వాహనాలకు ఫిట్‌నెస్ లేదని తేలింది.

Leave a Reply