ఏపీ ఫుట్‌బాల్‌కు కొత్త దిశ..

ఏపీ ఫుట్‌బాల్‌కు కొత్త దిశ..
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధికి కీలక మలుపు తిప్పే దిశగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన టాటా స్టీల్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని రాష్ట్ర యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు జాతీయ స్థాయి శిక్షణ, ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ వాతావరణాన్ని అందించేందుకు ముందుకొచ్చింది.
ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతులైన బాలబాలికలకు జంషెడ్‌పూర్‌లోని టాటా ఫుట్‌బాల్ అకాడమీలో అత్యున్నత స్థాయి శిక్షణ అవకాశాలు లభించనున్నాయి.

80 మంది యువ క్రీడాకారుల ఎంపిక
టాటా స్టీల్-శాప్ సంయుక్త భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 80 మంది యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. అండర్-21 బాలురు, అండర్-21 బాలికలు, అండర్-15 బాలురు, అండర్-15 బాలికలు అనే నాలుగు విభాగాల్లో ఒక్కో విభాగానికి 20 మంది చొప్పున ఎంపిక చేయనున్నారు.

ఈ ఎంపికల కోసం బుధవారం విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో ట్రయల్స్ నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి యువ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫుట్‌బాల్‌పై యువతలో పెరుగుతున్న ఆసక్తి, ప్రతిభ ఈ ఎంపికల్లో స్పష్టంగా కనిపించిందని నిర్వాహకులు తెలిపారు.
ఐజీఎంసీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం
శాప్, టాటా స్టీల్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో ప్రత్యేక ఫుట్‌బాల్ ప్రదర్శన మ్యాచ్‌తో పాటు పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాటా స్టీల్ లిమిటెడ్ చీఫ్ ఆఫ్ స్పోర్ట్స్, జంషెడ్‌పూర్ ఫుట్‌బాల్ క్లబ్ సీఈఓ ముకుల్ చౌధరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇటీవల అనంతపురంలో నిర్వహించిన శాప్ లీగ్ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న పలువురు యువ క్రీడాకారులతో ముకుల్ చౌధరి ప్రత్యేకంగా ముచ్చటించారు. ఏప్రిల్ 28 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ పోటీలు గ్రామీణ స్థాయి ప్రతిభను వెలికితీయడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం శాప్ లీగ్ రాష్ట్రవ్యాప్తంగా 31 క్రీడా విభాగాల్లో పోటీలను నిర్వహిస్తూ యువతకు క్రమబద్ధమైన పోటీ వేదికను కల్పిస్తోందని అధికారులు తెలిపారు.
గ్రామీణ ప్రతిభకు జాతీయ వేదిక
కార్యక్రమంలో శాప్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. భారణి ముకుల్ చౌధరిని సత్కరించారు. ఈ సందర్భంగా టాటా స్టీల్, శాప్ మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యంపై విస్తృత చర్చలు జరిగాయి.
గ్రామీణ స్థాయి ఫుట్‌బాల్ అభివృద్ధి, ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రొఫెషనల్ అవకాశాలు కల్పించడం, ఉన్నత ప్రమాణాల శిక్షణా వ్యవస్థలను రాష్ట్రంలో అభివృద్ధి చేయడం వంటి అంశాలపై దృష్టి సారించారు.
ఈ సందర్భంగా ఎస్. భారణి మాట్లాడుతూ.. టాటా స్టీల్‌తో భాగస్వామ్యం కేవలం ఎక్స్‌పోజర్ కార్యక్రమం మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ఫుట్‌బాల్ వ్యవస్థ నిర్మాణానికి ఇది కీలక అడుగని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభను గుర్తించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే ప్రొఫెషనల్ మార్గదర్శకత్వం, పోటీ వేదికలు, నాణ్యమైన శిక్షణ అవసరమని తెలిపారు.
టాటా స్టీల్ చీఫ్ ఆఫ్ స్పోర్ట్స్ ముకుల్ చౌధరి మాట్లాడుతూ.. భారతదేశంలోని ప్రతి మూలలోనూ ప్రతిభ ఉందని, ఆ ప్రతిభకు సరైన అవకాశాలు, ప్రోత్సాహం అవసరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ యువ ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో కనిపిస్తున్న పట్టుదల, నైపుణ్యం తమను ఆకట్టుకుందని తెలిపారు.
ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడకు కొత్త ఊపిరి లభించడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువ క్రీడాకారులకు జాతీయ స్థాయి అవకాశాల ద్వారాలు తెరుచుకోనున్నాయని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
