IND vs SL | శ్రీలంక చిత్తు.. టీమిండియా హ్యాట్రిక్ విక్టరీ..

IND vs SL | శ్రీలంక చిత్తు.. టీమిండియా హ్యాట్రిక్ విక్టరీ..
- షఫాలీ వర్మ ఊచకోత
- సిరీస్ భారత్ కైవసం
శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తిరువనంతపురంలో జరిగిన మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. బౌలర్ల సమిష్టి కృషితో శ్రీలంకను మరోసారి తక్కువ స్కోరుకే పరిమితం చేయగా… షఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది.
బౌలర్ల ధాటికి కుప్పకూలిన శ్రీలంక
టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు ఆరంభం నుండే శ్రీలంక బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టును అవుట్ చేసి తొలి దెబ్బ తీసింది. పవర్ ప్లే ముగిసే సమయానికి శ్రీలంక కీలక వికెట్లు కోల్పోయింది. ఇమేషా దులానీ, కవిషా దిల్హారి ఐదో వికెట్‌కు 40 పరుగులు జోడించినప్పటికీ, మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ ఠాకూర్ (4/21) నాలుగు వికెట్లతో చెలరేగగా, దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది.
షఫాలీ వర్మ మెరుపు హాఫ్ సెంచరీ..
అయితే, 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (1), జెమీమా రోడ్రిగ్స్ (9) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే, మరో ఓపెనర్ షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించిన షఫాలీ, కేవలం 42 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (21 నాటౌట్)తో కలిసి ఆమె భారత్‌ను విజ తీరాలకు చేర్చింది. భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను సొంతం చేసుకుంది.
