గుడివాడలో బక్రీద్ వేడుకలు ఘనంగా..

గుడివాడలో బక్రీద్ వేడుకలు ఘనంగా..

గుడివాడ, ఆంధ్రప్రభ: త్యాగానికి, భక్తికి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచే పండుగ బక్రీద్ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. అల్లాహ్ ఆదేశాన్ని శిరసావహించిన హజరత్ ఇబ్రహీం త్యాగనిరతిని ఈ పండుగ గుర్తుచేస్తుందన్నారు.

గుడివాడలో బక్రీద్ పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని గుల్జార్ చౌక్ మసీదు ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ప్రార్థనలకు విచ్చేసిన ఎమ్మెల్యే రామును ముస్లిం సాంప్రదాయం ప్రకారం మైనార్టీ నేతలు సత్కరించారు. అనంతరం ప్రార్థనలు ముగిసిన తర్వాత ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో అన్ని మతాలు, కులాల ప్రజలు సోదరభావంతో కలిసిమెలిసి ఉండటం సంతోషకరమన్నారు.

కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, మైనార్టీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గుడివాడలో మైనార్టీల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, సీనియర్ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, మైనార్టీ నేతలు షేక్ ఇబ్రహీం, సయ్యద్ జబీన్, జానీ షరీఫ్, షేక్ సర్కార్, మహమ్మద్ రఫీ, నూర్, సర్తాజ్ పాషా, మోబీన్, హఫీజ్, నాగుల, సోము, కూటమి నాయకులు పాల్గొన్నారు.