సీఐటీయూ సమావేశాలను విజయవంతం చేయాలి: కల్లూరి మల్లేశం
మోత్కూరు, ఆంధ్రప్రభ: ఆగస్టు 16, 17, 18 తేదీల్లో భువనగిరిలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని సీఐటీయూ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
ఆదివారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో స్థానిక ఆర్పీలతో కలిసి రాష్ట్ర కమిటీ సమావేశాలకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అఖిల భారత, రాష్ట్ర నాయకత్వంతో పాటు అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చిస్తారని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడం ద్వారా కార్మికుల హక్కులను బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరించడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.6 ద్వారా కనీస వేతనాలను సవరించినప్పటికీ, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను నిర్ణయించలేదని అన్నారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఆర్పీలు వంటి స్కీమ్ వర్కర్లకు జీవన వ్యయానికి అనుగుణంగా కనీస వేతనాలు పెంచడంతో పాటు ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమాలపై భువనగిరి సమావేశాల్లో కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ సమావేశాల విజయానికి కార్మికులు, ప్రజలు ఆర్థికంగా, నైతికంగా సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్పీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు పరమేశ్వరి, నాయకులు సతీష్, రాజేశ్వరి, రేణుక, సువర్ణ, నరేందర్, శివ తదితరులు పాల్గొన్నారు.
