రాత్రివేళ నిఘాలో కొత్త టెక్నాలజీ..
రాత్రివేళ నిఘాలో కొత్త టెక్నాలజీ..
పుట్టపర్తి క్రైమ్, ఆంధ్రప్రభ: జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ శాఖ ఆధునాతన సాంకేతికతను వినియోగిస్తోంది. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు రాత్రి వేళల్లో ‘నైట్ విజన్’ డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
ఈ వినూత్న నిఘాలో భాగంగా జిల్లాలోని ముఖ్య కూడళ్లు, జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాలు, పండుగలు, ఉత్సవాలు జరిగే ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టారు. చీకటిలో కూడా స్పష్టమైన దృశ్యాలు అందించే నైట్ విజన్ డ్రోన్ల సాయంతో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
అర్ధరాత్రి వేళ ముమ్మర తనిఖీలు
ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఎయిర్‌పోర్ట్ సీఐ బొజ్జప్ప తన సిబ్బందితో కలిసి పుట్టపర్తి సబ్ డివిజన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
పుట్టపర్తి అర్బన్ పరిధిలోని కర్ణాటక నాగేపల్లి, సత్తెమ్మ సర్కిల్, పుట్టపర్తి టౌన్, బుక్కపట్నం టౌన్, కొత్తచెరువు, బసవన్నకట్ట, నెహ్రూ సర్కిల్, కొత్తచెరువు రూరల్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను వినియోగించి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. వీధులు, సందులు, ప్రధాన కూడళ్లలో కదలికలను కంట్రోల్ రూమ్ ద్వారా నిశితంగా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. నైట్ విజన్ డ్రోన్ల వినియోగంతో రాత్రివేళల్లో జరిగే దొంగతనాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ముందుగానే గుర్తించి అడ్డుకోవచ్చని తెలిపారు. రద్దీ సమయాలు, రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలను పర్యవేక్షించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను కూడా తగ్గించవచ్చన్నారు.
మహిళలు, వృద్ధులు, సామాన్య ప్రజలకు రాత్రివేళల్లో మరింత సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
డ్రోన్ పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎయిర్‌పోర్ట్ సీఐ బొజ్జప్ప హెచ్చరించారు.
జిల్లాలో నేరరహిత సమాజ నిర్మాణానికి పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే డయల్-100 లేదా 112కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఫోటో రైటప్: పుట్టపర్తిలో నైట్ విజన్ డ్రోన్ కెమెరాతో నిశితంగా పరిశీలిస్తున్న పోలీసులు.
