Santokbaa | సేవకు సత్కారం.. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంతోఖ్బా అవార్డులు

Santokbaa | సేవకు సత్కారం.. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంతోఖ్బా అవార్డులు

  • సూరత్‌లో వైభవంగా అవార్డుల ప్రదానోత్సవం..
  • ప్రముఖుల సమక్షంలో సత్కారం

ఆంధ్రప్రభ : కరుణ, సేవ, నాయకత్వం ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాలను ప్రకాశవంతం చేసిన ప్రముఖులను గౌరవించే సంతోఖ్బా (Santokbaa) హ్యుమానిటేరియన్ అవార్డు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ (SRK) వారి సామాజిక సేవా సంస్థ అయిన శ్రీ రామకృష్ణ నాలెడ్జ్ ఫౌండేషన్ (SRKKF) ఆధ్వర్యంలో నిర్వహించిన సంతోఖ్బా హ్యుమానిటేరియన్ అవార్డు-2026 ప్రదానోత్సవ కార్యక్రమం సూరత్‌లోని సంజీవ్ కుమార్ ఆడిటోరియంలో అత్యంత వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవితో పాటు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు.

సమాజంలో గొప్ప మార్పులు తీసుకువచ్చిన ప్రముఖులను గుర్తించే ఈ ఏడాది సంతోఖ్బా హ్యుమానిటేరియన్ అవార్డులను ప్రముఖ ఇండియన్ ఆప్తాల్మాలజిస్ట్ (నేత్ర వైద్య నిపుణులు), ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపక ఛైర్మన్(Founder Chair) పద్మశ్రీ డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావుతో పాటు భారతీయ గ్రామీణాభివృద్ధి కార్యకర్త, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ (SEWA) డైరెక్టర్ పద్మశ్రీ రీమా నానావతిలకు ప్రదానం చేశారు.

ఈ సంవత్సరం వేడుకల్లో ఒక ముఖ్యమైన మార్పుగా ఎస్ఆర్‌కేకేఎఫ్ (SRKKF) కొత్తగా ‘సోషల్ ఆంట్రప్రెన్యూర్ అవార్డు’ (Social Entrepreneur Award) ను ప్రవేశపెట్టింది. వ్యాపార నైపుణ్యంతో పాటు సమాజంపై సానుకూల ప్రభావం చూపేలా వినూత్నంగా పనిచేసే లీడర్లను గుర్తించడానికి ఈ అవార్డును తీసుకువచ్చారు.

పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేసే బోలెంట్ ఇండస్ట్రీస్ ఫౌండర్ శ్రీకాంత్ బొల్లా ఈ మొదటి అవార్డును అందుకున్నారు. దృష్టి లోపం ఉన్నప్పటికీ ఆయన తన వ్యక్తిగత ఇబ్బందులను అధిగమించి సమాజంలో అందరినీ కలుపుకుపోయేలా ఒక గొప్ప ఆశయంతో ముందుకు సాగారు. దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తూనే పర్యావరణానికి మేలు చేసేలా ఒక సరికొత్త వ్యాపార విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు.

శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SRK), ఎస్ఆర్‌కే నాలెడ్జ్ ఫౌండేషన్ (SRKKF) ఫౌండర్, చైర్మన్ ఎమెరిటస్ గోవింద్ ధోలాకియా 2006లో ఈ అవార్డులను స్థాపించారు. నిస్వార్థ సేవ, సమాజంలో మార్పు తీసుకువచ్చిన లీడర్‌షిప్‌ను గౌరవిస్తూ సాగుతున్న ఈ ప్రయాణం ఇప్పుడు రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. తన తల్లి సంతోక్‌బా చూపిన కరుణ, నిస్వార్థ విలువలతో కూడిన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేలా ఆయన ఈ అవార్డులను తీసుకువచ్చారు.

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కూడిన ఒక స్వతంత్ర జ్యూరీ కమిటీ ఎంతో పారదర్శకంగా, కఠినమైన నిబంధనలతో పరిశీలించి ఈ అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది. ఈ 2026 అవార్డుల ఎంపిక జ్యూరీలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) డైరెక్టర్ గోవిందన్ రంగరాజన్, ఇస్రో (ISRO) మాజీ ఛైర్మన్ ఎ.ఎస్. కిరణ్ కుమార్, భారత నౌకాదళ మాజీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ (రిటైర్డ్), సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్ పార్ట్‌నర్ రిషభ్ ష్రాఫ్, ఎస్‌ఆర్‌కే (SRK) సంస్థల వ్యాపారవేత్త, బ్రాండ్ కస్టోడియన్ శ్రేయాన్స్ ధోలాకియా ఉన్నారు.

ఈ కార్యక్రమంలో గోవింద్ ధోలాకియా మాట్లాడుతూ.. “మా అమ్మ తన జీవితమంతా గుజరాత్‌లోని దుధాలా అనే ఒక చిన్న గ్రామంలోనే గడిపారు. కానీ ఆమె పిల్లలమైన మేమంతా కేవలం జీవితంలో విజయం సాధించడమే కాకుండా.. నిజాయితీ, ప్రేమ, కరుణ ద్వారా మా జీవితాలను అర్థవంతంగా మార్చుకోవాలని ఆమె కలలు కన్నారు. ఆమె మాకు నేర్పిన ఈ విలువల వల్లే ఆమె వారసత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. మానవ సేవకే తమ జీవితాలను అంకితం చేసిన గొప్ప వ్యక్తులను గౌరవించడం కోసం స్థాపించిన ఈ సంతోక్‌బా హ్యుమానిటేరియన్ అవార్డుకు ఆ విలువులే పునాదిగా నిలిచాయి. ఈ అవార్డు 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కోట్లాది మంది జీవితాలను స్పృశిస్తూ, దేశవ్యాప్తంగా సమాజాలను బలోపేతం చేస్తున్న అసాధారణ లీడర్లను గుర్తించడంలో మా అమ్మ ఆశయాలు ఇప్పటికీ స్ఫూర్తిని రగిలిస్తుండటం చూసి నా మనసు ఎంతో గర్వంతో నిండిపోయింది” అని అన్నారు.

అవార్డు గ్రహీతల గురించి ధోలాకియా మాట్లాడుతూ, “ఈ ఏడాది అవార్డులు అందుకున్న ప్రముఖులు ఒక స్పష్టమైన లక్ష్యంతో చేసే పనులు కోట్లాది మంది జీవితాలను ఎలా మార్చగలవు అనే విషయాన్ని నిరూపించారు. వారి ఆలోచనలు, అంకితభావం మరియు సేవలు సమాజంపై ఒక చెరగని ముద్రను వేశాయి. నిజమైన విజయం అనేది కేవలం మన వ్యక్తిగత విజయాలలో మాత్రమే కాదు.. మన చుట్టూ ఉన్న వారిని మనం ఎలా పైకి తీసుకువస్తాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది అని వారు మనకు గుర్తు చేస్తున్నారు” అని పేర్కొన్నారు.

సంతోఖ్బా హ్యుమానిటేరియన్ అవార్డు రావడంపై డాక్టర్ గుల్లాపల్లి ఎన్.రావు మాట్లాడుతూ.. “సంతోఖ్బా హ్యుమానిటేరియన్ అవార్డు అనేది ఎంతో విలువైన గుణాలైన సానుభూతి, సేవ , ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే నిబద్ధతకు నిదర్శనం. నాణ్యమైన కంటి వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం అంకితభావంతో పనిచేసిన ఎంతో మంది వ్యక్తులు, సంస్థల తరపున ఈ గౌరవాన్ని అందుకోవడం నాకు దక్కిన నిజమైన గౌరవం. మేమంతా కలిసి దృష్టిని పునరుద్ధరించడం ద్వారా ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, కొత్త అవకాశాలను నింపే మార్పును కళ్లారా చూశాం. ఎస్‌ఆర్‌కే (SRK) సంస్థలోని పనితీరును, అక్కడి వ్యవస్థలను చూశాక అది ఖచ్చితంగా ప్రపంచ స్థాయి సంస్థ అని అర్థమైంది. సూరత్ నగరానికి రావడం నాకు ఇదే మొదటిసారి, ఈ పర్యటన ఎంతో అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది. మా ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి (LVPEI) బృందం కూడా గోవింద్‌కాకా నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందని భావిస్తున్నాను” అని చెప్పారు.

సంతోఖ్బా హ్యుమానిటేరియన్ అవార్డు రావడంపై శ్రీమతి రీమా నానావతి మాట్లాడుతూ.. “ఈ గౌరవం నిజంగా తమ పట్టుదల, ఆత్మవిశ్వాసం , వ్యాపార స్ఫూర్తితో ప్రతిరోజూ మాకు స్ఫూర్తినిచ్చే లక్షలాది మంది మహిళలకే చెందుతుంది. సేవా (SEWA) సంస్థతో సాగిన నా ప్రయాణం ఒక సాధారణ నమ్మకాన్ని మరింత బలోపేతం చేసింది. మహిళలకు సరైన అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తే.. వారు తమ కుటుంబాలలో, సమాజంలో గొప్ప మార్పును తీసుకువచ్చే శక్తివంతమైన వ్యక్తులుగా మారతారు. ప్రస్తుతం సమాజానికి అవసరమైన నైపుణ్యాలను అందించడం ద్వారా అణగారిన వర్గాల అభివృద్ధి కోసం సేవా (SEWA) మరియు ఎస్‌ఆర్‌కే (SRK) సంస్థలు కలిసి పలు రంగాలలో పనిచేసే అవకాశం ఉంది” అని చెప్పారు.

తొలిసారిగా ప్రవేశపెట్టిన సామాజిక పారిశ్రామికవేత్త పురస్కారాన్ని అందుకున్న శ్రీకాంత్ బొల్లా మాట్లాడుతూ.. “పరిమితులు అనేవి కేవలం మన ఆలోచనల్లోనే ఉంటాయని, నిజ జీవితంలో కావని నా ప్రయాణం నాకు నేర్పింది. ఈ సంతోక్‌బా సోషల్ ఆంట్రప్రెన్యూర్ అవార్డును అందుకున్న మొదటి వ్యక్తిని కావడం నాకు ఎంతో ప్రత్యేకంగా ఉంది. సరైన అవకాశాలు, ప్రోత్సాహం , పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతు మేలు చేయగలరని, తమ పరిధిని దాటి అద్భుతాలు సృష్టించగలరని నా నమ్మకాన్ని ఈ పురస్కారం మరోసారి గుర్తుచేసింది. ఈ రోజు నేను మీ వజ్రాలలోనూ, ఎస్‌ఆర్‌కే (SRK) సంస్థలోనూ ఒకే రకమైన అద్భుతమైన ప్రతిభను చూశాను. గోవింద్‌కాకా లాగే మనల్ని నడిపించే ఒక అదృశ్య శక్తిపై నాకు గట్టి నమ్మకం ఉంది. నేను మీ నగరానికి రావడం వెనుక ఒక నిజమైన విధి ఉందని భావిస్తున్నాను. మన రెండు సంస్థల మధ్య ఒక అర్థవంతమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని చెప్పారు.

గడిచిన 20 ఏళ్లలో సంతోక్‌బా హ్యుమానిటేరియన్ అవార్డు భారత దేశంలోని 19 మంది అత్యంత ప్రముఖ మానవతావాదులను, సామాజిక లీడర్లను గౌరవించింది. వీరిలో రతన్ టాటా, దలైలామా, డాక్టర్ సుధా మూర్తి, డాక్టర్ సైరస్ పూనావాలా, శివ్ నాడార్, డాక్టర్ అభయ్ బ్యాంగ్, డాక్టర్ రాణి బ్యాంగ్, డాక్టర్ వర్గీస్ కురియన్, కైలాష్ సత్యార్థి, ఎ.ఎస్. కిరణ్ కుమార్లతో పాటు పలువురు లీడర్లు ఉన్నారు. కాగా 2026 సంవత్సరంలో ఎస్ఆర్‌కేకేఎఫ్ కొత్తగా సంతోఖ్బా సోషల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ అవార్డును కూడా ప్రారంభించగా.. శ్రీకాంత్ బొల్లా దీని మొదటి గ్రహీతగా నిలిచారు.

సంతోఖ్బా హ్యుమానిటేరియన్ అవార్డు 20 ఏళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో.. ఈ మైల్‌స్టోన్ వేడుకలు సమాజంలో కరుణ, సేవ , స్పష్టమైన లక్ష్యంతో కూడిన లీడర్‌షిప్ ప్రాధాన్యతను మరోసారి చాటిచెప్పాయి. మానవత్వానికి సేవ చేయడం, ఆవిష్కరణలు, కరుణ ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతూ ఈ అవార్డు ప్రయాణం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.

Santokbaa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *