గ్రామ పాలన అధికారులపై పని ఒత్తిడి తగ్గించాలి..
- రాష్ట్ర గ్రామ పాలన అధికారుల ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంగేమ్ పృథ్వి రాజ్
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలన అధికారుల (జీపీవోలు)పై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని రాష్ట్ర గ్రామ పాలన అధికారుల ఆర్గనైజింగ్ సెక్రటరీ, నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన సంగెం పృథ్విరాజ్ ప్రభుత్వాన్ని కోరారు.
గురువారం ఆయన మాట్లాడుతూ, సాధా బైనామాలు, వివిధ ధ్రువపత్రాల జారీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి బాధ్యతలతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా జీపీవోలపైనే అధిక పనిభారం పడుతోందన్నారు. అదనంగా డీసీహెచ్బీ సెన్సస్ విధుల్లోనూ జీపీవోలను భాగస్వాములను చేయడం వల్ల పనిభారం మరింత పెరిగిందని తెలిపారు.
పనిభారం అధికంగా ఉండటంతో పై అధికారుల నుంచి ఒత్తిడి కూడా పెరుగుతోందని, దీనివల్ల గ్రామ పాలన అధికారుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పృథ్విరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
సొంత నియోజకవర్గాల్లో కాకుండా ఇతర నియోజకవర్గాల్లో జీపీవోలకు పోస్టింగ్లు ఇవ్వడం వల్ల ప్రయాణ భారం కూడా పెరుగుతోందని అన్నారు. గ్రామ పాలన అధికారులపై ఉన్న అదనపు పనిభారాన్ని తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
