Sangareddy ప్లాస్టిక్ తగ్గింపుతోనే స్థిరమైన అభివృద్ధి
Sangareddy ప్లాస్టిక్ తగ్గింపుతోనే స్థిరమైన అభివృద్ధి
- పరిశ్రమలు పర్యావరణ బాధ్యత పెంచుకోవాలి: ప్రధాన పర్యావరణ ఇంజనీర్ కె. శ్రీనివాసరెడ్డి
సంగారెడ్డి (Sangareddy), ఆంధ్రప్రభ:
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారానే స్థిరమైన అభివృద్ధి సాధ్యమని, పరిశ్రమలు పర్యావరణ బాధ్యతను మరింత పెంచుకోవాలని ప్రధాన పర్యావరణ ఇంజనీర్ కె. శ్రీనివాసరెడ్డి సూచించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (సంగారెడ్డి) ఆధ్వర్యంలో పటాన్‌చెరు ఐలా సమావేశ మందిరంలో పరిశ్రమల ప్రతినిధులతో కలిసి “99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, వ్యర్థాల నిర్వహణలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. సీనియర్ పర్యావరణ ఇంజినీర్లు బి.వి. భద్రగిరీశ్, కుమార్ పాఠక్, ఎన్. విజయలక్ష్మి, మాధురి, అలాగే ఐలా చైర్మన్ దుర్గప్రసాద్ వివిధ పర్యావరణ అంశాలపై ప్రసంగించారు.
వక్తలు పర్యావరణ చట్టాలు, వ్యర్థాల వర్గీకరణ, సర్క్యులర్ ఎకానమీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన, వాతావరణ మార్పుల సవాళ్లు వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. శిక్షణ శిబిరంలో జేకే ఫెన్నర్ (ఇండియా) లిమిటెడ్, సెఖ్మెట్ ఫార్మావెంచర్స్, న్యూలాండ్ లాబొరేటరీస్ ప్రతినిధులు ఈఎస్జీ విధానాలు, పర్యావరణ చర్యలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు.
సుమారు 80 మంది పరిశ్రమల ప్రతినిధులకు వ్యర్థాల సరైన వర్గీకరణ, ప్లాస్టిక్ తగ్గింపు, పర్యావరణ నిబంధనల అమలుపై అధికారులు సూచనలు చేశారు. పరిశ్రమలు చురుకైన భాగస్వామ్యం వహించి స్థిరమైన అభివృద్ధికి దోహదపడాలని అధికారులు పిలుపునిచ్చారు.
