Chittoor-Mayor-Race : మేయర్ కుర్చీలాట‌ Andhra Prabha Top Story

Chittoor-Mayor-Race : మేయర్ కుర్చీలాట‌ Andhra Prabha Top Story

  • ఆశ‌ల ప‌ల్లకీలో బాబులు
  • లాబీయింగ్ లో బిజీబిజీ..
  • రిజర్వేషన్ తోనే అస‌లు క‌థ
  • మారనున్న సమీకరణలు
  • చిత్తూరులో రాజ‌కీయ ఉత్కంఠ‌త‌

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

Chittoor-Mayor-Race చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకముందే మేయర్ పీఠం కోసం రాజకీయ వేడి అమాంతం పెరిగింది. మేయర్ పదవి ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందో అధికారికంగా ప్రకటించకపోయినా, కూటమి పార్టీల్లో ఆశావహులు ఇప్పటికే తమ లాబీయింగ్‌ను ముమ్మరం చేశారు. ఈసారి పోటీ కేవలం పదవి కోసం మాత్రమే కాదు… రాజకీయ వారసత్వం, సామాజిక సమీకరణాలు, కేడర్ బలం, అధిష్ఠాన అనుకూలతల మధ్య ఆసక్తికర సమరం సాగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో పలువురు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, యువ నాయకులు తమకు లేదా తమ కుటుంబ సభ్యులకు మేయర్ టికెట్ దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికే బాబు వర్గం నుంచి ఆయన సతీమణి సికే లావణ్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చిత్తూరు రాజకీయాల్లో సికే బాబుకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్, పాత కేడర్, బలమైన నెట్‌వర్క్ ఈసారి కలిసి వస్తాయని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వద్ద కూడా మేయర్ టికెట్ అంశాన్ని ప్రస్తావించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో సీకే బాబు ఆయన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొలుపు కోసం గట్టిగా కృషి చేశారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం చివరి వరకు పోటీలో నిలిచి, చివరికి గురజాల జగన్మోహన్ నాయుడు విజయానికి కృషి చేసిన కాజూరు బాలాజీ కూడా మేయర్ రేసులో బలమైన ఆశావహుడిగా నిలిచారు. గత రెండు దశాబ్దాలుగా పార్టీకి సేవలు, కరోనా సమయంలో చేసిన సేవా కార్యక్రమాలు, తన సామాజిక వర్గ ఓటర్ల ప్రభావం తనకు కలిసివస్తాయని ఆయన వర్గం ధీమాగా ఉంది. ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ గా, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్ష పదవికి గట్టి పోటీ ఇచ్చారు. గతంలో మేయర్ గా పనిచేసిన కటారి హేమలత కూడా మరోసారి ఆ పదవిని ఆశిస్తున్నారు. చిత్తూరు మేయర్ గా ఉండగా కటారి అనురాధ మున్సిపల్ కార్యాలయంలోని హత్యకు గురయ్యారు. అలాగే ఆమె భర్త కటారి మోహన్ కూడా మృత్యువు పాలయ్యారు. కటారి అనురాధ స్థానంలో కార్పొరేటర్ గా ఎన్నికైన కటారి హేమలత మేయర్ పీఠాన్ని అధిష్టించారు. కొంతకాలం మాత్రమే పని చేశారు. ప్రస్తుతం కడ చైర్మన్ గా పనిచేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ కుటుంబం నుంచి ఆయన కుమారుడు వినోద్ పేరు కూడా చర్చలో ఉంది. కడ చైర్మన్ పదవికి కూడా వినోద్ పోటీ పడ్డట్టు సమాచారం. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో వినోద్ చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. తండ్రి రాజకీయ వారసత్వం, కాపు సామాజిక వర్గ మద్దతు తనకు బలమని భావిస్తున్నారు. మరోవైపు మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ కూడా మేయర్ రేసులో ఉన్నారు. కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం, కుటుంబ రాజకీయ నేపథ్యం, యువతలో మంచి ఫాలోయింగ్ ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు. అంతేకాదు, బాలాజీ హ్యాచరీస్‌కు చెందిన సుందరనాయుడు మనుమడు కోడి ఈశ్వర్‌బాబు పేరు కూడా తాజాగా వినిపిస్తోంది. వ్యాపార, సామాజిక వర్గాల్లో ఉన్న పరిచయాలు తనకు బలమవుతాయని ఆయన వర్గం అంచనా వేస్తోంది.

ఇక కూటమిలో భాగమైన జనసేన పార్టీ కూడా చిత్తూరు మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకుంది. తిరుపతి కార్పొరేషన్‌ను తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తే, చిత్తూరు మేయర్ స్థానాన్ని జనసేనకు ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు. అలా జరిగితే జనసేన నాయకురాలు ఆరణి కవిత పేరు మేయర్ అభ్యర్థిగా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రిజర్వేషన్ అంశమే ప్రస్తుతం ప్రధాన చర్చగా మారింది. గత ఎన్నికల్లో మేయర్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆముద మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈసారి ఓసీ జనరల్, ఓసీ మహిళ లేదా బీసీ జనరల్ కేటగిరీల్లో ఏదో ఒకటి ఖరారయ్యే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. రిజర్వేషన్ ఏ వర్గానికి ఖరారవుతుందన్న దానిపైనే ఆశావహుల భవితవ్యం ఆధారపడి ఉంది. చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికలను అధికార కూటమి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు నాయకత్వంలో ఈసారి కార్పొరేషన్‌పై పట్టు సాధించాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో 50లో 46 డివిజన్లు గెలుచుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తిరిగి బలంగా పోటీకి సిద్ధమవుతోంది. అయితే వారు వన్ సైడ్ అని తెలుగుదేశం పార్టీ గట్టిగా నమ్ముతుంది. వీలైనన్ని వార్డులను ఏకగ్రీవం చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికే కార్పొరేటర్లుగా పోటీ చేసి అభ్యర్థుల జాబితా సిద్ధంగా ఉందని సమాచారం. మేయర్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థిని నిర్ణయించే అవకాశం ఉంది. మేయర్ పీఠం ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందో అనే ఉత్కంఠ చిత్తూరు రాజకీయాల్లో రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం మేయర్ పీఠం కోసం సాగుతున్న ఈ హోరాహోరీ పోరు చిత్తూరు రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది.