15years | మోడీ, అమిత్ షా నాయకత్వంలో పనిచేస్తాం

15years | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆప్ నేత రాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి దూరమవుతున్నట్లు ప్రకటిస్తూ, ఆప్ ఇప్పుడు నిజాయతీ రాజకీయాలకు దూరమైందని విమర్శించారు.

సీనియర్ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌లతో కలిసి మీడియాతో మాట్లాడిన రాఘవ్ చద్దా, 15 ఏళ్లుగా ఆప్‌కు అంకితభావంతో పనిచేశానని తెలిపారు. ఒకప్పుడు అవినీతి నిర్మూలన నినాదంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు తన అసలు సిద్ధాంతాల నుంచి దూరమైందన్నారు. “నేను సరైన వ్యక్తినే, కానీ తప్పుడు పార్టీలో ఉన్నాను” అంటూ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

ఆప్‌కు రాజ్యసభలో మొత్తం 10 మంది సభ్యులు ఉండగా, వారిలో మూడింట రెండొంతుల మంది తనతో పాటు బీజేపీ వైపు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వీరిలో ప్రముఖ క్రీడాకారుడు హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్ వంటి వారు కూడా ఉన్నట్లు తెలిపారు.

గత కొంతకాలంగా పార్టీలో రాఘవ్ చద్దా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన్ను రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడి పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించడం పార్టీ అంతర్గత విభేదాలను బయటపెట్టింది.

ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే పలు సవాళ్లను ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వానికి ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply