ముసురుతో మన్యం మురిసింది..!!

  • ఏజేన్సీలో వరద నీటీతో నిండుకుంటున్న వాగులు వంకలు
  • శబరి, సీలేరు నదుల్లోకి చేరుకుంటున్న వరద నీరు
  • మూడు రోజులుగా మన్యంను వీడని వర్షం

చింతూరు (పోలవరం జిల్లా), ఆంధ్రప్రభ : చింతూరు మన్యంలో మూడు రోజులు నుండి వరుసగా వర్షం కురుస్తూ ముసురు పట్టడంతో ఆ ముసురుతో మన్యం మురిసి తడిసి ముద్దైంది. వేసవి ముగిసిన తరువాత జూన్‌, జూలై నెలలో మొకం చాటేసిన వరుణుడు ఎట్టకేలకు మంగళవారం వర్షం ప్రారంభమై మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఏజేన్సీలో సైతం నిరంతరంగా ఓ మోస్తారులో మూడు రోజుల నుండి క్షణం ఖాళీ లేకుండా మన్యాన్ని వీడకుండా వర్షం 24 గంటల పాటు పడుతూనే ఉంది. ఈ వర్షం క్షణం కూడా ఖాళీ లేకుండా కుండపోతాల కురుస్తుండటంతో ప్రజల పనులకు అటంకం ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజుల వరకు వేడిగా ఉండటంతో ఏసీలు వినియోగించారు. ఈ వర్షంతో మన్యం ప్రాంతం అంతా చల్లని గాలులు, చక్కటీ ప్రశాంత వాతావరణం నెలకొంది.

శబరి, సీలేరు నదులకు జలకళ..

చింతూరు మండల కేంద్రానికి అనుకోని ప్రవహిస్తున్న శబరి నది, మండలంలోని ఆంధ్రా – ఒరిస్సా రాష్ట్రాల సరిహాద్దుల్లో ఉన్న సీలేరు నదికి వరద నీరు వచ్చి చేరుకుంటుంది. వేసవిలో శబరి నది తగ్గి వెలవెలబోయి ఇసుక తెన్నలతో దర్శనమించిన శబరి, సీలేరు నదులు ఈ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద నీరు శబరి, సీలేరు నదుల్లోకి నీరు చేరుకొని నెమ్మదిగా నిండుకొని జలకళ సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే శబరి నది గురువారం ఉదయం నాటికి కనిష్ట నీటి మట్టానికి చేరుకుంది. ఒక్క రోజు వ్యవధిలోనే వరద నీరు శబరి నదికి చేరుకొని జలకళతో కళకళలాడుతుంది.

వరదనీటీతో వాగులు వంకలు – పరవళ్ళుతో పోల్లూరు జలపాతం..

చింతూరు మన్యంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం దాటీకి వరదనీరు వాగులు, వంకల్లో చేరుకొని వాగులు, వంకలు నిండుకుంటున్నాయి. వేసవి ముగిసినప్పటకీ ఇప్పటీకీ సరైన వర్షం లేకపోవడంతో నిన్న, మొన్నటీ వరకు ఇసుక మాత్రేమే కనిపించే వాగులు, వంకలు ఇప్పుడు వరద నీరు చేరుకొని నిండుకుంటూ ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలంలోని శబరి నదికి అనుసంధానంగా ఉన్న సోకిలేరు, చంద్రవంక, అత్తకోడళ్ళు, జల్లివారిగూడెం, కుయుగూరు వాగులు వరద నీటీతో నిండుకుంటున్నాయి. మోతుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పోల్లూరు జలపాతం ఈ వర్షాలతో జలకళతో నిండి ఉధృతంగా గుట్టల మీద నుండి జాలువారుతూ పరవళ్ళు తోక్కుతూ ప్రవహిస్తూ సుందరంగా కనిపిస్తుంది. మారేడుమిల్లి – చింతూరు ఘాట్‌ రోడ్‌లోని సోకిలేరు వాగు ప్రకృతి హోయల నడుమ మనోహారంగా ప్రవహిస్తుంది.

గండి పోచమ్మ తల్లి ఆలయం వద్దకు చేరిన వరద..

రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని దేవిపట్నం మండలం పూడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల గొందూరు ప్రసిద్ది పుణ్యక్షేత్రమైన గండిపోచమ్మ అమ్మవారి ఆలయం గోదావరి వరద ఆలయ ప్రాంగాణంలోకి చేరుకుంది. ఇది ఇలా ఉంటే ఇటు విఆర్‌ పురం నుండి, అటు దేవిపట్నం నుండి నడిచే పాపికొండల విహారయాత్రకు వరదలతో బ్రేక్‌ పడింది.