Rs.99.95 | మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయ్…

Rs.99.95 | మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయ్…

  • వారంలో రెండోసారి పెంపుతో ఆందోళన

Rs.99.95 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు భారీ షాక్‌ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చమురు సంస్థలు లీటరుకు 90 పైసల చొప్పున ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. ఇంధన ధరల తాజా పెంపు మరింత భారంగా మారింది.

తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.88కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.99.95గా నమోదైంది. గత వారం కూడా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో.. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ధరలు పెరగడం గమనార్హం. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో పెట్రోల్ ధరలు మరింత ఎగబాకే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్‌ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటమే దేశీయంగా ఇంధన ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

అదేవిధంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటం కూడా చమురు దిగుమతుల వ్యయాన్ని పెంచుతోంది. భారత్ భారీగా చమురు దిగుమతులపై ఆధారపడే దేశం కావడంతో అంతర్జాతీయ ధరల మార్పులు నేరుగా దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

ఇంధన ధరలు పెరగడంతో త్వరలోనే బస్సులు, క్యాబ్‌లు, సరుకు రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని ట్రాన్స్‌పోర్ట్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు అధికంగా ఉండగా.. రవాణా వ్యయం పెరగడం వల్ల మరింత ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలతో మధ్యతరగతి, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు, డెలివరీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లపై అదనపు భారం పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

పెట్రోల్‌ ధరలు:
ఢిల్లీలో రూ.98.64 (+0.87),
కోల్‌కతాలో రూ.109.70 (+0.96),
ముంబయి రూ.107.59 (+0.91),
చెన్నై రూ.104.49 (+0.82)గా ఉండనున్నాయి.

డీజిల్‌ ధరలు:
ఢిల్లీలో రూ.91.58 (+0.91),
కోల్‌కతాలో రూ.96.07 (+0.94),
ముంబయి రూ.94.08 (+0.94),
చెన్నై రూ.96.11 (+0.86)గా ఉండనున్నాయి.

ఇక, తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.88కు చేరగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ.99.95కి పెరిగాయి. నాలుగు రోజుల క్రితం లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచాయి. మరోవైపు ధరల నియంత్రణ కోసం కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం వసూలును కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలోనే మరోసారి ధరలు పెంచడం గమనార్హం.