భగ్గుమన్న కమర్షియల్ సిలిండర్ ధరలు

భగ్గుమన్న కమర్షియల్ సిలిండర్ ధరలు
ఒక్కసారిగా వెయ్యి రూపాయల పెరుగుదల
చిన్న వ్యాపారాలపై భారమైన దెబ్బ..
హోటళ్లు, టీ దుకాణాలకు పెరిగిన ఖర్చు
వినియోగదారులపై ధరల బాదుడు తప్పదా..?
విజయవాడ, ఆంధ్రప్రభ : జిల్లాలో వాణిజ్య వర్గాలను కుదిపేస్తూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇప్పటి వరకు సుమారు రూ 2,258గా ఉన్న సిలిండర్ ధర, మే 1 నుంచి అమలులోకి వచ్చిన తాజా సవరణలతో రూ 3,069–రూ 3,071 వరకు పెరగడం గమనార్హం. ఒక్కసారిగా దాదాపు వెయ్యి రూపాయల మేర పెరిగిన ఈ ధరలతో హోటల్, రెస్టారెంట్, టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు వంటి చిన్న, మధ్య తరహా వ్యాపారాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఇప్పటికే కిరాణా సరుకులు, కూరగాయలు, వంటనూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో, గ్యాస్ ధరల ఈ భారీ పెరుగుదల వ్యాపారులకు ‘డబుల్ బ్లో’గా మారింది. రోజువారీ వ్యాపారాల్లో లాభాలు కరిగిపోతుండగా, పెరిగిన ఖర్చులను భరించడం చిన్న వ్యాపారులకు కష్టసాధ్యంగా మారింది. ముఖ్యంగా టీ దుకాణాలు, చిన్న హోటళ్లు రోజుకు ఒకటి నుంచి రెండు సిలిండర్లు వినియోగించాల్సి రావడంతో నెలవారీ ఖర్చులు గణనీయంగా పెరిగినట్లు వారు వాపోతున్నారు.
“ఇలా ఖర్చులు పెరిగితే వ్యాపారం కొనసాగించడం కష్టమే” అని పలువురు చిన్న వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చులను తగ్గించడానికి సిబ్బందిని తగ్గించడం, లేదా పరిమిత మెనూ వైపు వెళ్లడం వంటి చర్యలు చేపట్టే పరిస్థితి నెలకొంది. మరోవైపు, పెరిగిన వ్యయాన్ని వినియోగదారులపై మోపక తప్పదన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీంతో త్వరలోనే టిఫిన్లు, భోజనాలు, టీ ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అయితే, గృహ వినియోగానికి సంబంధించిన డొమెస్టిక్ సిలిండర్ ధరలు ప్రస్తుతం రూ 937గా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీనివల్ల సాధారణ గృహ వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం ఉన్నప్పటికీ, వాణిజ్య రంగంపై పడిన ప్రభావం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంధన ధరల అస్థిరత కొనసాగితే చిన్న వ్యాపారాల నిలకడపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై సమీక్షించి ఉపశమన చర్యలు చేపట్టాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.
