Maha Ganapati | కర్రపూజతో విగ్రహ నిర్మాణ పనుల ప్రారంభం

Maha Ganapati | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల ఏర్పాట్లు శుక్రవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. సంప్రదాయబద్ధంగా కర్రపూజ నిర్వహించిన అనంతరం మహాగణపతి విగ్రహ నిర్మాణ పనులకు ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీకారం చుట్టారు.

ప్రతి ఏడాది వినూత్న రూపంలో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్ మహాగణపతి, ఈసారి ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ రూపంలో కొలువుదీరనున్నట్లు ఉత్సవ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో విగ్రహ నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నారు.

విగ్రహ నిర్మాణం ప్రారంభమైన సందర్భంగా కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, పనులు నిరాటంకంగా సాగాలని వినాయకుడిని ప్రార్థించారు. రానున్న రోజుల్లో విగ్రహ నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల కోసం ఇప్పటికే భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.