TeckTOK | ఇలా అయితే ఈజీగా పాస్‌వర్డ్ హాక్ హ్యాక్ చేయొచ్చు..
- ఈ తప్పు చేస్తే మీ డేటా అంతా హ్యాకర్ల చేతిలో !!
- ఏఐ యుగంలో పాస్‌వర్డ్‌లకు కొత్త సవాళ్లు
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు నిత్యజీవితంలో భాగమైపోయాయి. అయితే సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అదే స్థాయిలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి.
అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ సులభంగా గుర్తుండిపోతుందనే ఉద్దేశంతో బలహీనమైన పాస్‌వర్డ్‌లనే ఉపయోగిస్తున్నారు. ఇదే నిర్లక్ష్యం సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఆధునిక కంప్యూటర్లు, ఏఐ ఆధారిత టూల్స్ సహాయంతో కొన్ని సెకన్లలోనే పాస్‌వర్డ్‌లను క్రాక్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడే ప్రమాదం పెరుగుతోంది.
అయితే, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ఉండాలంటే బలమైన పాస్‌వర్డ్‌నే తొలి రక్షణ కవచంగా ఎంచుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ భద్రతలో పాస్‌వర్డ్ కీలక పాత్ర పోషిస్తుందని, బలహీనమైన పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు ఆధునిక సాంకేతికతతో క్షణాల్లోనే ఛేదించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మనం ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్ నిజంగా ఎంత సురక్షితం? దాన్ని హ్యాకర్లు గుర్తించడానికి ఎంత సమయం పడుతుంది? పాస్‌వర్డ్‌ను మరింత బలంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? అనే అంశాలు ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
సులభంగా గుర్తుంచుకోవచ్చనే ఉద్దేశంతో.. మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, పేర్లు లేదా సాధారణ పదాలను పాస్‌వర్డ్‌లుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఏఐ ఆధారిత టూల్స్ సాయంతో హ్యాకర్లు అలాంటి పాస్‌వర్డ్‌లను కేవలం కొన్ని సెకన్లలోనే ఛేదించే స్థాయికి చేరుకున్నారని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడే ప్రమాదం రోజురోజుకూ పెరుగుతోంది.
పాస్‌వర్డ్ భద్రత అనేది కేవలం అక్షరాల సంఖ్యపైనే ఆధారపడి ఉండదు. అందులో ఉపయోగించే లోయర్‌కేస్, అప్పర్‌కేస్ (చిన్న, పెద్ద అక్షరాలు), సంఖ్యలు, సింబల్స్ ఏ విధంగా కలిపి ఉన్నాయన్నదే… పాస్‌వర్డ్ బలాన్ని నిర్ణయించి హ్యాకర్ల నుంచి రక్షణ కల్పిస్తుందని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నారు.
ఒకే పాస్‌వర్డ్ వద్దు..
ఈమెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా, షాపింగ్ యాప్స్ వంటి అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్ ఉపయోగించకూడదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా ఒక అకౌంట్ హ్యాక్‌కు గురైతే, అదే పాస్‌వర్డ్‌ను ఉపయోగించి మిగిలిన అకౌంట్లలోకి కూడా హ్యాకర్లు ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. ప్రతి అకౌంట్‌కు ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకుంటే బెటెర్ అంటుంన్నారు సైబర్ నిపుణులు. అవసరమైతే పాస్‌వర్డ్ మేనేజర్ యాప్స్‌ను ఉపయోగించి వివిధ పాస్‌వర్డ్‌లను సురక్షితంగా మేనేజ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
చిన్న పాస్‌వర్డ్‌లతో భారీ ప్రమాదం…
కేవలం 6 లేదా 7 అక్షరాలతో ఉండే పాస్‌వర్డ్‌లు ఎంత క్లిష్టంగా కనిపించినా ఏఐ టూల్స్ కు అవి పెద్ద సవాలు కావని సైబర్ నిపుణుల హెచ్చరిస్తున్నారు. అలాంటి పాస్‌వర్డ్‌లను కొన్ని సెకన్లలోనే క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇక 8 అక్షరాల పాస్‌వర్డ్‌లో క్యాపిటల్ లెటర్స్, నెంబర్స్, సింబల్స్ వంటి అంశాలు ఉంటే.. దానిని క్రాక్ చేయడానికి ఎక్కువ సమయం పట్టినా, అది కూడా పూర్తి భద్రతకు గ్యారంటీ కాదని నిపుణులు చెబుతున్నారు.
అదే 10 అక్షరాల పాస్‌వర్డ్‌లో లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కలిపి ఉంటే దానిని క్రాక్ చేయడానికి సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇంకా 12 అక్షరాల పాస్‌వర్డ్‌లో అప్పర్‌కేస్, లోయర్‌కేస్ లెటర్స్, నెంబర్స్, సింబల్స్ అన్నింటినీ కలిపి ఉపయోగిస్తే దానిని గుర్తించడం అత్యంత క్లిష్టంగా మారుతుంది.
అయితే 100 శాతం సెక్యూరిటీ అనే భావనను పూర్తిగా నమ్మరాదని నిపుణులు సూచిస్తున్నారు. ఫిషింగ్ అటాక్స్, డేటా బ్రీచెస్, ఫేక్ లింక్స్, మోసపూరిత వెబ్‌సైట్లు వంటి ఇతర మార్గాల ద్వారా కూడా అకౌంట్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే బలమైన పాస్‌వర్డ్‌తో పాటు టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2ఎఫ్‌ఏ) వంటి అదనపు భద్రతా చర్యలు కూడా తప్పనిసరిగా ఉపయోగించాలని సూచిస్తున్నారు.
సురక్షిత పాస్‌వర్డ్ ఎలా ఉండాలి?
కనీసం 12 నుంచి 16 అక్షరాల పొడవు ఉండాలి.
అప్పర్‌కేస్, లోయర్‌కేస్, సంఖ్యలు, ప్రత్యేక గుర్తులు కలిపి ఉండాలి.
పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను ఉపయోగించకూడదు.
ప్రతి అకౌంట్‌కు వేర్వేరు పాస్‌వర్డ్‌లు ఉపయోగించాలి.
పాస్‌వర్డ్‌లను తరచూ మార్చడం మంచిది.
టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి
ఆ లింకులు క్లిక్ చేస్తే ఇక అంతే..
పాస్‌వర్డ్ పొడవు పెరిగే కొద్దీ, అలాగే క్యాపిటల్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ సింబల్స్ కలిపి ఉపయోగించే కొద్దీ ఆ పాస్‌వర్డ్ ని క్రాక్ చేయడం మరింత కష్టతరంగా మారుతుంది. ముఖ్యంగా 12 అక్షరాల కంటే ఎక్కువ పొడవుతో కూడిన స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు సైబర్ దాడుల నుంచి మెరుగైన రక్షణ కల్పిస్తాయి.
అయితే, పాస్‌వర్డ్ ఎంత బలంగా ఉన్నా అదనపు సెక్యూరిటీ కోసం టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్‌ఏ) తప్పనిసరిగా ఉపయోగించాలని అంటుంన్నారు సైబర్ నిపుణులు. పాస్‌వర్డ్‌తో పాటు ఓటీపీ లేదా అథెంటికేటర్ యాప్ ద్వారా అదనపు వెరిఫికేషన్ ఉండటం వల్ల హ్యాకర్లకు అకౌంట్‌లోకి యాక్సెస్ పొందడం మరింత కష్టమవుతుంది.
డిజిటల్ ప్రపంచంలో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటా, సోషల్ మీడియా అకౌంట్లను సురక్షితంగా ఉంచుకోవాలంటే కేవలం బలమైన పాస్‌వర్డ్ సరిపోదని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తో పాటు.. అనుమానాస్పద లింక్‌లకు దూరంగా ఉండటం వంటి అదనపు సెక్యూరిటీ చర్యలు కూడా తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని, చిన్న పొరపాటు కూడా వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీలకు ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ అకౌంట్లకు బలమైన పాస్‌వర్డ్‌లు సెట్ చేసుకుని, అదనపు సెక్యూరిటీ ఫీచర్లను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
