HYD | రూ.107 కోట్లతో నాలుగు చెరువుల పునరుద్ధరణ..

మూసాపేట కాముని చెరువుకు రూ.21 కోట్లతో అభివృద్ధి పనులు
వరద ముంపు నివారణ, భూగర్భ జలాల పెంపే లక్ష్యం..
ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రాలుగా తీర్చిదిద్దనున్న ప్రభుత్వం

HYD | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో వరద ముంపు సమస్యను తగ్గించడం, భూగర్భ జలాల మట్టాన్ని పెంచడం లక్ష్యంగా హైడ్రా (HYDRAA) చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులకు వేగం పెరిగింది. రూ.107 కోట్లతో నాలుగు చెరువులను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా కూకట్‌పల్లి మండలం మూసాపేటలోని కాముని చెరువు పునరుద్ధరణ పనులకు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు.

హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాముని చెరువును సుమారు రూ.21 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. మొత్తం నాలుగు చెరువుల పునరుద్ధరణ కోసం రూ.107 కోట్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. చెరువు పరిసరాలను పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల ఆట స్థలాలు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఈ ప్రాంతాలను ప్రజలకు ఆహ్లాదకరమైన విహార, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు.

ఈ సందర్భంగా అధికారులకు హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో వరద నీరు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవహించేలా చెరువుల ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లను పటిష్టం చేయాలని ఆదేశించారు. అలాగే మురుగు నీటి సమస్య, దుర్వాసన నివారణ కోసం చెరువులోని పూడికను పూర్తిగా తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువుల పునరుద్ధరణతో నగరంలో వరద ముప్పు తగ్గడంతో పాటు భూగర్భ జలాల మట్టం పెరగడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం, ప్రజలకు మెరుగైన విహార వసతులు అందుబాటులోకి రావడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు భావిస్తున్నారు.