వ‌డివ‌డిగా జ‌ల‌ధార.. ఒడిసిప‌ట్టు జీవ‌ధార‌…

వ‌డివ‌డిగా జ‌ల‌ధార.. ఒడిసిప‌ట్టు జీవ‌ధార‌…

జిల్లాలో ముమ్మ‌రంగా సాగుతున్న ప‌నులు
మంజూరైన 197 ప‌నుల్లో 88 ప‌నులు ప్రారంభం..
త్వ‌ర‌లో మ‌రికొన్ని ప‌నులకు శ్రీకారం
క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కార్య‌క్ర‌మం అమ‌లు
శాస్త్రీయ దృక్ప‌థంతో ప‌దేళ్ల డేటా ఆధారంగా కార్యాచ‌ర‌ణ‌

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : నీటి భద్రత ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన జ‌ల‌ధార‌-జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మం కింద ఎన్‌టీఆర్ జిల్లాలో ప‌నులు వ‌డివ‌డిగా ముందుకెళ్తున్నాయి. నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 100 రోజుల ప్రత్యేక కార్యాచరణతో టీమ్ ఎన్‌టీఆర్ విజ‌య‌వంతంగా కార్య‌క్ర‌మాన్ని న‌డిపిస్తోంది. ప్ర‌ధానంగా ఫీడ‌ర్ ఛాన‌ళ్లు, చెరువుల్లో పూడికతీత వంటి ప‌నులు చ‌క‌చ‌కా సాగుతున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు 197 ప‌నులు మంజూరుకాగా ఇప్ప‌టికే 88 ప‌నులు ప్రారంభ‌మై పురోగ‌తి ద‌శ‌లో ఉన్నాయి. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఈ ప‌నుల ప్ర‌గ‌తిని నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తూ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి దిశానిర్దేశం చేస్తున్నారు. స్లూయిస్ మ‌రమ్మ‌తులు, ఫీడ‌ర్ ఛాన‌ళ్ల అభివృద్ది వంటివాటిపైనా దృష్టిసారిస్తున్నారు. భూగ‌ర్భ జ‌లాల పెంపు ల‌క్ష్యంగా వర్షపు నీటిని సమర్థంగా నిల్వ చేసేందుకు రీచార్జ్ పిట్స్, పర్కొలేషన్ ట్యాంకుల నిర్మాణం, పాత జలవనరుల పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. ప‌ల్లె సీమ‌ల‌కు జీవ‌నాడులైన చెరువులు వ‌ట్టిపోకుండా జీవ‌క‌ళ‌తో క‌ల‌కాలం నిలిచేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

గ్రామీణ జీవ‌నంతో ముడిప‌డిన చెరువులు..

గ్రామీణ జీవన విధానంలో చెరువులు ఎంతో కీలక స్థానం కలిగి ఉన్నాయి. వర్షాకాలంలో నిల్వ అయ్యే నీటిని రైతులు సాగునీటిగా వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయం సుస్థిరంగా కొనసాగుతుంది. ఈ చెరువులు కేవలం పంటలకే కాకుండా పశువులకు తాగునీటిని అందించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. చెరువుల్లో నిల్వ అయ్యే నీరు భూమిలోకి జొరబడి భూగర్భ జలాల స్థాయిని పెంచుతుంది.

దీంతో బోర్లు, బావులు ఎండిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. అదేవిధంగా చెరువులు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కూడా కీలకంగా పనిచేస్తాయి. పక్షులు, చేపలు, వివిధ రకాల జీవులు ఈ నీటి వనరులపై ఆధారపడి జీవిస్తాయి. ఈ నేప‌థ్యంలో చెరువుల అభివృద్ధికి సంబంధించిన ప‌నులపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించ‌డం జ‌రుగుతోంది. జిల్లాలోని 439 చెరువులు ఎప్పుడూ నీటిసిరితో తొణికిస‌లాడేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

విస్తృత ప్ర‌జాభాగ‌స్వామ్యంతోనే కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం..

విస్తృత ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌తో ముడిప‌డియున్న ఏ కార్య‌క్ర‌మ‌మైనా ప్ర‌జా భాగ‌స్వామ్యంతో విజ‌యం సాధిస్తుందది. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు, సాగు నీటి సంఘాలు.. ఇలా ప్ర‌తిఒక్క‌రి భాగ‌స్వామ్యంతో జ‌ల‌ధార‌-జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకెళ్తున్న‌నం.శాస్త్రీయ దృక్ప‌థంతో ప‌దేళ్ల డేటా ఆధారంగా చెరువులు,కాలువల పున‌రుద్ధ‌ర‌ణ‌, చెరువుల అనుసంధానం, నీటి సంర‌క్ష‌ణ విధానాలు, ప‌చ్చ‌ద‌నం పెంపొందించ‌డం, గ్రామ నీటి బ‌డ్జెట్ ల‌క్ష్యాల‌తో ఈ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నాం.
జలధార కార్యక్రమం ద్వారా భవిష్యత్ తరాలకు సుస్థిర నీటి వనరులు అందుబాటులోకి వస్తాయి.