పంద్రాగస్టుకు సమన్వయంతో ఏర్పాట్లు చేయండి…

జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా


నరసరావుపేట (ఆంధ్రప్రభ) : స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పగడ్బంధీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

బుధవారం ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆగస్టు 15న స్థానిక పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే వేడుకల్లో.. జెండావందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను, వేదికను అందంగా అలంకరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులు, ఇతర అతిథులను వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించాలని సంబందిత అధికారులను ఆదేశించారు.కార్యక్రమానికి హాజరైన వారికి తాగునీటిని సరఫరా,మొబైల్ టాయిలెట్ల ను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి సంబంధించి జిల్లాలో సాధించిన ప్రగతిని చాటిచెప్పేలా శకటాలు, ఎగ్జిబిషన్ స్టాళ్ళను ఏర్పాటు చేయాలని డిఆర్డీఏ, డ్వామా, హార్టికల్చర్, ఏపీఎంఐపీ, జల వనరుల శాఖ, వ్యవసాయము, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, డియంహెచ్ఓ తదితర శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉదయం పెరేడ్ మైదానంలో, సాంస్కృతిక కార్యాక్రమాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కన్నుల పండువగా సాగేలా సంసిద్ధం చేయాలని డీఈవోను ఆదేశించారు.

ముఖ్యంగా.. ఆయా శాఖల్లో విశిష్ట సేవలు అందించిన ఉత్తమ అధికారులు, సిబ్బంది, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయడానికి సంబంధిత ప్రతిపాదిత జాబితాను నిర్ణీత గడువు లోపు అందించాలని ఆదేశించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీసుల మార్చి ఫాస్ట్ లో ఎన్ సిసి కేడెట్లను భాగస్వామ్యం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.