శభాష్.. మున్సిపల్ చైర్మన్ సాబ్
జోరు వానలో హోరుగా పర్యవేక్షణ.. అప్రమత్తంగా ఉండాలని సూచన
మంథని, ఆంధ్రప్రభ: ఆపద సమయంలోనే నాయకత్వం బయటపడుతుందనే మాటను మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ మరోసారి నిరూపించారు. బుధవారం మంథని పట్టణంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మురికి కాలువలు పొంగిపొర్లడం, పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడంతో సమస్యాత్మక ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ పెంటరి రాజుతో కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చైర్మన్ పరిస్థితిని సమీక్షించి, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాల సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించరాదని తెలిపారు.
అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ పాలకవర్గం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు కుర్ర లింగయ్య, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
