పోచారం ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం
భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం.. 8 అడుగులకు చేరిన నీటి నిల్వ
నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ: నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో లింగంపేట్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
దీంతో పోచారం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీలో ఉన్న నీటిమట్టం బుధవారం నాటికి 8 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి లింగంపేట్ వాగుతో పాటు ఇతర ఒర్రెల ద్వారా సుమారు 2 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా, మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలు. ప్రస్తుతం 8 అడుగుల నీటిమట్టంతో ప్రాజెక్టులో 0.228 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది.
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
